Monday, December 23, 2024

అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు

- Advertisement -
- Advertisement -

రాజకీయ వివక్షకు తావులేకుండా అందిస్తాం

మాది ప్రజల ప్రభుత్వం… ఇందిరమ్మ రాజ్యం తెస్తాం!
అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం!!
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మన తెలంగాణ/ హైదరాబాద్:  తమ ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వమని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర సంపద ప్రజలకు అంకితం చేసి ‘ఇందిరమ్మ రాజ్యం’ స్థాపించడమే ప్రజాపాలన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని గుర్తు చేశారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం పేద కుటుంబాలు ఎప్పడు వస్తాయి అని ఎదురుచూస్తున్నారని, గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికే తమ ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ప్రజాపాలన కార్యక్రమం తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు 6 గ్యారెంటీలు పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్షతకు తావులేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారంటీలు కచ్చితంగా అందిస్తామని పేర్కొన్నారు.

పేద, మధ్యతరగతి ప్రజల ఆర్ధిక స్థితిగతులు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ కర్తవ్యమని, ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని నిరూపించామన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసిని వెంటనే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడానికి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయం రూ.10 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో లబ్ధి జరుగుతున్నదని వెల్లడించారు. అభయ హస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలు ఎవరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల దగ్గరకి వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రజాపాలన తెలంగాణలోనే మొదలైందన్నారు.

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట తాను పాదయాత్ర చేసిన సమయంలో మహిళలు వారి సమస్యలు వివరించి ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలతో పాటు ప్రతి సంస్థ, వ్యవస్థ నా కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడికి కలిగించే బాధ్యతగా ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్య పాలన ఉంటుందన్నారు. నాడు పాదయాత్రలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్‌కు వచ్చినప్పుడు ఇళ్లు లేని పేద ప్రజలు తనను కలిశారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం నేడు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేసుకునే లబ్ధిదారుడికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రసంగిస్తూ వచ్చే నెల 6 వరకు ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల లబ్ది కోసం ప్రజలు దరఖాస్తులు ఇవ్వొచ్చని, ఒకవేళ అందుబాటులో లేనివారు ఈ వారం రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా వార్డులలో ఉన్న అధికారులకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగo చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జనవరి 6 వరకు వారం రోజుల పాటు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపారు. (డిసెంబర్ 31,జనవరి 1 సెలవు రోజులు మినహా) అభయహస్తం 6 గ్యారంటీల కొరకు కుటుంబం నుండి ఒకే దరఖాస్తూ మాత్రమే సమర్పించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి, రసీదు పొందాలని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు చేయాలనే నిబంధన లేదని, ఆధార్ కార్డ్ జిరాక్స్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, వదంతులు నమ్మవద్దని అందజేసిన ప్రతి దరఖాస్తును స్వీకరిస్తామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు రశీదు, దరఖాస్తు నంబర్ భద్రపరచుకోవాలని, ప్రజల నుంచి తీసుకున్నా దరఖాస్తులను అధికారులు జాగ్రతగా భద్రపరచాలని అధికారులకు సూచించారు. గ్రామ సభలు సజావుగా జరగాలని, ఆయా అధికారులు, బృందాలు ఎలాంటి అలసత్వం వహించవద్దన్నారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్వీకరించాలన్నారు. సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హన్మంతు, స్పెషల్ ఆఫీసర్ శృతి ఓజా, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, జిల్లా పరిషత్ సిఈఓ దిలీప్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, సిపిఓ సౌమ్య, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత రెడ్డి, ఎంపిడిఓ, గ్రామ సర్పంచ్ కిరణ్, ఎంపిపి రేఖ మహేందర్, జెడ్పీటీసీ బీంగీ దాస్, సంబంధిత అధికారులు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News