హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ప్రధాని మోడీ పైశాచికంగా వ్యవహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోడీ మహబూబ్‌నగర్ లేదా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట పోటీ చేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర బిజెపి నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.. ప్రధాని మోడీ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసిన ఓడించి తీరుతామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు పథకాన్ని ఆపలేదన్నారు. దేశంలో నూటికి నూరు శాతం ధాన్యం కొనుగోలు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుబంధు కార్యక్రమం కింద నిధుల విడుదల కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.