Sunday, January 19, 2025

పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తాం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఉద్యమకారులను గౌరవిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు: బిజెపి నేత రఘనందన్‌ రావు

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్టా నీటిలో 299 టిఎంసీలకు ఒప్పందం చేసుకుందని గత ప్రభుత్వమేనని, ఒకవేళ కృష్టాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకుపోలేదని బిజెపి మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే ఎక్కువ స్థానాలు తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  తమ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదేళ్ల గులాబీ పార్టీ పాలనలో ఉద్యమకారులను, కార్యకర్తలను ఏనాడైనా గౌరవిస్తే ఆ పార్టీకి ఈ పరిస్థితి ఉండేది కాదని హితవు పలికారు.

పార్లమెంటు ఎన్నికల్లో వందల కోట్లు సమర్పించుకున్న వారికే టిక్కెట్లు అమ్ముకుంటారని ఆరోపించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మాజీ సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులు ఎంపీలుగా పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్నారు. కెఆర్‌ఎంబీకి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులను అప్పగిస్తే నష్టం జరుగుతుందని, భవిష్యత్తులో కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటి వాటా లభ్యం కాదని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారని… 2014- నుంచి 2019 మధ్య కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో జరిగిన కృష్ణానదీ జలాల పంపకాలపై జరిగిన సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ హాజరై 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చాలని సంతకం పెట్టింది వాస్తవమా, కాదా? అని దీనికి హరీశ్ రావు సమాధానం చెప్పాలని నిలదీశారు.

గజ్వేల్‌కు, సిద్దిపేటకు రైలు సదుపాయం కల్పించిన ఘనత ప్రధాన నరేంద్ర మోడీకే దక్కుతుందని రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేశారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీపై విమర్శలు మానుకోవాలని బిఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ సీట్లు బిజెపి గెలిచి కేంద్రంలో మూడోసారి అధికారం చేపడుతుందన్నారు. ఈ సమావేశంలో ఆపార్టీ నాయకులు తోకల శ్రీనివాస్ రెడ్డి, రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News