Monday, January 20, 2025

అర్హులందరికీ దళిత బంధు ఇస్తాం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ ప్రతినిధి: దేశమంతా తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అర్హులందరికీ విడతల వారీగా అందిస్తామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలోని వారి నివాసంలో ఎస్సీ కార్పోరేషన్ జిల్లా అధికారులు, నియోజకవర్గంలోని ఎంపీడీఓలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇంత మంచి పథకాన్ని దళితులంతా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిర పడాలని సూచించారు.

ఏ యూనిట్ ద్వారా వారి కుటుంబానికి మేలు కలుగుతుందో కుటుంబ సభ్యులంతా ఆలోచించి ఆ యూనిట్‌ని ఎంచుకోవాలన్నారు. రేపటి నుంచి పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మండలాల వారు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో, పరకాల మున్సిపాలిటీకి చెందిన వారు పరకాలలోని మున్సిపల్ కార్యాలయంలో, జీడబ్లూఎంసీ పరిధిలోని 15, 16, 17 డివిజన్ల పరిధిలోని వారు జీడబ్లూఎంసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు వెంట కులం, ఆదాయం, నివాసం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కాపీలను జత చేయాలన్నారు. ఒంటరి మహిళలు, పురుషులు, 58 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకం వర్తించదన్నారు.

దరఖాస్తుదారుని ఆధార్ గుర్తింపు కార్డు స్థానిక నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలన్నారు. ఒక కుటుంబానికి ఒకటే యూనిట్ వర్తిస్తుందన్నారు. వయస్సు పైబడిన తల్లిదండ్రులు ఉంటే వారి కుటుంబంలో కుమారులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ అధికారులు మాధవిలత, సురేష్, ఎంపీడీఓలు రాజేంద్రప్రసాద్, అనిత, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, వీరేశం, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News