Tuesday, September 17, 2024

జర్నలిస్టులకు మాది జిమ్మేదారి: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

జర్నలిస్టుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం
విధివిధానాలు రూపొందించండి
వాటికి చట్టబద్ధత కల్పించే బాధ్యత తీసుకుంటాం
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు
గత పదేళ్లలో తెలంగాణలో ఏ వ్యవస్థకు పాలసీ లేదు
ప్రెస్ అకాడమీకి స్పెషల్ ఫండ్ కింద రూ. 10 కోట్లు
ఫ్యూచర్ సిటీలో మిగతా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం
వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ఆలోచన
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించాలని, వాటికి చట్టబద్ధత కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని, ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు, ఇళ్ల పట్టాలు, హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. పేట్ బషీర్‌బాద్‌లో ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల స్థలాల పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అలా వ్యవహరించినప్పుడే సమస్యను పరిష్కరించవచ్చన్నారు. తమ ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని, వృత్తిపరమైన గౌరవం మనకు మనమే పెంచుకోవాలని సూచించారు. గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదని, తమ ప్రభుత్వం వచ్చాక స్పీకర్‌కు తానే అసెంబ్లీ లోపలికి జర్నలిస్టులను అనుమతించాలని కోరానని వెల్లడించారు.

ఏ వర్గంలో అయినా కొందరు చేసే పని వల్లనే ఇబ్బంది కలుగుతోందని, గతంలో సచివాలయానికి వెళ్లేందుకు తమకే అనుమతి లేదని, కొంత మందికి పాస్‌లు ఇచ్చి లోపలికి రప్పించి ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపైనే ఉందన్నారు. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో 73 మంది నిజాన్ని చూడక ముందే కన్ను మూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ అకాడమీకి స్పెషల్ ఫండ్ కింద రూ. 10 కోట్లు కేటాయిస్తున్నామని, ఆ నిధులతో జర్నలిస్టులకు సదస్సులు, శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు.

నాకూ ఇంటిపట్టా ఇంకా రాలేదు:

ఎమ్మెల్యేగా రూ.10 లక్షలు కట్టిన తనకు కూడా ఇంకా ఇంటిపట్టా రాలేదని, తన ఇంట్లో కూడా ఇంకా అడుగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి సభలో అనగానే నవ్వులు వెల్లివిరిశాయి. రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు ఒకరినొకరు గౌరవించుకుంటూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని సూచించారు. ఢిల్లీలో విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులకు సెంట్రల్ హాల్‌లోకి వెళ్లేందుకు కూడా పర్మినెంట్ పాస్‌లు వారి సీనియారిటీని బట్టి ఇచ్చారని, అలాగే తెలంగాణలో కూడా సీనియారిటీ ప్రాతిపదికన సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించేలా ఎవరికి పాస్‌లు ఇవ్వాలన్నది మీడియా అకాడమీ, సభ్యులు నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు.

యూట్యూబ్ ఛానెల్ పెట్టి ప్రతి ఒకరు జర్నలిస్ట్ అంటున్నారు:

అసలు జర్నలిస్టుల కంటే కొసరు జర్నలిస్టులు ఎక్కువయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజమైన జర్నలిస్టులను అగౌరవపరిచే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రస్తుతం ఎవరు పడితే వారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని జర్నలిస్టులంటున్నారన్నారని, కొంతమంది చిట్ చాట్లను కూడా బదనాం చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు సమాజానికి సేవ చేసే డాక్టర్లు అని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చిక్కుముళ్లను పరిష్కరించిందని గుర్తు చేశారు. జర్నలిస్టులు పార్టీ కార్యకర్తలగా వ్యవహరించవద్దని కోరారు. కొన్ని రాజకీయ పార్టీలే పత్రికలు నడుపుతున్నాయని, సిద్దాంతాలను ప్రచారం చేసుకునే పత్రికలు ఎక్కువయ్యాయన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో ఏ వ్యవస్థకు పాలసీ లేదన్నారు. చిన్న, పెద్ద పత్రికలను ఎలా గుర్తించాలో ఒక నివేదికను తయారు చేయాలన్నారు.

ఫ్యూచర్ సిటీలో మిగతా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు:

ప్రస్తుతం ఇంటి స్థలాలు రాని పాత్రికేయ మిత్రులు బాధపడాల్సిన అవసరం లేదని, ఫ్యూచర్ సిటీలో వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడిన జర్నలిస్టుల కల నెరవేరిందని, ఇల్లు అనేది ఎవరికైనా పెద్ద కల అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు పూర్తిగా స్వేచ్చ ఇస్తున్నామన్నారు. 1100 మంది జర్నలిస్టులకు ఈ రోజు పండగ రోజుని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కారం చేశామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కమిటీ వేయాలని సూచించారు.

పింక్ కలర్ పేపర్లు వరదల పైనా రాజకీయం: మంత్రి పొంగులేటి

మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మూసీ ప్రక్షాళన, ఫోర్త్ సిటీ, రైతులకు రూ.31 వేలకోట్ల రుణమాఫీ వంటి మంచి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిచేస్తుంటే శవాల మీద చిల్లర ఏరుకునేలా వరదల్లోనూ బురద రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. రెండు సార్లు కర్రు కాల్చి వాత పెట్టినా వారికి ఇంకా బుద్ది రాలేదని అన్నారు. మీడియా మిత్రులపై ఉక్కుపాదం మోపారని, పత్రికా సమావేశాల్లో వారిని టార్గెట్ చేసి మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు కావాలి..ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఆశించామని, వారి చిరకాల వాంఛ అయిన ఇంటి స్థలాలను అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే చేసి చూపించామని అన్నారు. ప్రస్తుతం ఈ సొసైటీలోని జర్నలిస్టు మిత్రులు లక్షాధికారులు కాదని, కోటీశ్వరులని మంత్రి సభలో చమత్కరించారు.

జిల్లా, మండల స్థాయిలోనూ ఇళ్లస్థలాలు ఇవ్వాలి:మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలోని జిల్లా, మండల కేంద్రాల్లోని అర్హులైన జర్నలిస్టు మిత్రులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో అందరూ బాగుండాలని కోరుకుంటుందని, నమ్మకంగా రాజ్యాంగాన్ని అమలు చేసే పార్టీ అని స్పష్టం చేశారు.

జర్నలిస్టుల్లో అనర్హులను నియంత్రిస్తాం: మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి

జర్నలిస్టుల్లో అనర్హులను నియంత్రించేలా చర్యలు చేపడుతామని మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు అక్రిడేషన్ కార్డులకు రేటుకట్టి అమ్ముకుంటున్నాయని, వాటిని అరికట్టకపోతే భవిష్యత్తులో జర్నలిజం విలువలు మరింత దిగజారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని మనమే కట్టడి చేసుకుని నిజమైన జర్నలిస్టులను గుర్తించి వారికి అక్రిడేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు, ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు సరికొత్త గైడ్‌లైన్స్ రూపొందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

లేఔట్ విషయంలో సహకరించాలి : ఎన్. వంశీ శ్రీనివాస్

ప్రభుత్వం నిజాంపేట, పేట్ బషీరాబాద్ స్థలాల్లో లేఔట్ చేసే విషయంలో సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సొసైటీ డైరెక్టర్ ఎన్. వంశీ శ్రీనివాస్ కోరారు. నిజాంపేట లో కేటాయించిన 32 ఎకరాల్లో ఉన్న రాతి గుట్టలను తొలగించేందుకు ప్రభుత్వమే చొరప చూపాలని సూచించారు. జర్నలిస్టు కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడూ రుణ పడిఉంటాయని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరువాత ప్రస్తుతం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్లు బి. కిరణ్‌కుమార్, ఆర్ రవికాంత్‌రెడ్డి, ఎన్. వంశీ శ్రీనివాస్, పి.వి రమణరావు, కె. అశోక్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అశువులు బాసిన జర్నలిస్టు మిత్రుల కుటుంబసభ్యులకు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి జర్నలిస్టు మిత్రులు తమ కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News