మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తక్షణమే తెలంగాణ రైతాంగానికి, యువతకు ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్యనాయక్ అన్నారు. శుక్రవారం మానుకోట పట్టణంలోని రామమందిరం నుంచి నెహ్రూసెంటర్ వరకు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీల రైతు, యూత్ డిక్లరేటషన్ హామీలపై ప్రజల్లో చైతన్య కల్పించేందుకు ఆయన స్థానిక కాంగ్రెస్ నేతలతో కలసి విస్త్రతంగా పర్యటించి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా రోజు వారీ కూలీలు, కూరగాయల మార్కెట్‌లోని చిరువ్యాపారులు, వీధి వ్యాపారులతో మమేకమై విస్త్రత ప్రఛారం నిర్వహించారు. బెల్లయ్యనాయక్ వారితో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు వస్తే రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ఎకరాను రూ. 15 వేల పెట్టుబడి సాయం, భూమి లేని నిరుపేదలైన రైతు కూలీలకు ప్రతి ఏడాదికి రూ. 12 వేలు అందజేస్తామని వారికి వివరించారు. రూ. ఐదొందలకే గ్యాస్ సిలండర్, ఇంట్లో ఇద్దరు వృద్ధ్దులు ఉంటే నెలకు రూ. ఐదు వేలు అందిస్తామని వెల్లడించారు.
ధరణి పోర్టల్ రద్దు చేసి సరికొత్త రెవెన్యూ చట్టం అమలుకు శ్రీకారం చుడుతామన్నారు. రైతు కమీషన్‌తో పాటు రైతులందరికీ ఆరోగ్య భీమా కార్డులు అందిస్తామని, ఇందిరమ్మ ఇంటికి రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు వారి తల్లితండ్రులు, లేదా భార్యకు నెలకు రూ. 25 వేలు గౌరవ పింఛన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అందిస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షులు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, ఓబీసీ పట్టణ అద్యక్షులు వీరభద్రం, మైనారిటీ నాయకుల యాకూబ్ పాషా, అన్వర్, తేజావత్ శంకర్‌నాయక్, ముత్తయ్య, వేల్పుల ్రశ్రీకర్, శ్రీశైలం, కోడి రవి, యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.