Wednesday, January 22, 2025

కొత్త విద్యుత్ విధానం అమలు చేస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం/సింగరేణి : రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీ అమలు చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రామవరం సమీపంలో 10.5 మెగావాట్ల పవర్ సోలార్ ప్లాంట్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం కొత్త పోకడలను సృష్టిస్తోందని, ఇందులో భాగంగా విద్యుత్ రం గంలో కూడా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రస్తుతం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సంస్థ మరో ఐదేళ్లలో వంద మిలియన్‌లు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో బొగ్గు నిల్వలు తగ్గి పోతున్నాయని, ఇంధన, విద్యుత్ రంగాల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. సింగరేణి సంస్థ కూడా నాణ్యమైన పవర్ ఉత్పత్తికి బాటలు వేసుకుంటోందని అన్నారు. సింగరేణి అంటే కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, ఉద్యోగుల గనిగా అభివర్ణించారు. రాష్ట్రానికి వెలుగులు నింపడమే కాకుండా జీవనభృతి కల్పిస్తున్న అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అని స్పష్టం చేశారు. తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న సంస్థకు తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా పెంచుతామని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు కూడా కోటి రూపాయల ఇన్సూరెన్స్ పథకం ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించేందుకు తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పారు. జలాశయాల వద్ద పంప్ స్టోరేజీ విధానాన్ని సోలార్‌తో అనుసంధానం చేసి, నీటిని సరికొత్త మార్గంలో పంపిణీ చేస్తామని తద్వారా బొగ్గు ఉత్పత్తి ఆధారిత విద్యుత్ మిగులు సాధ్యమవుతుందని అన్నారు.
సింగరేణి సంస్థను గాలికి ఒదిలేసిన గత సర్కార్
గత ప్రభుత్వం సింగరేణి సంస్థను గాలికి ఒదిలేసిందని, కార్మికుల, సంస్థ భవిష్యత్తు పట్ల నిర్లక్షంగా వ్యవహరించిందని విమర్శించారు. గతంలో సిఎల్‌పి నేతగా తాను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాదయాత్రలో సింగరేణి సమస్యలు కూడా ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నానని, ఆ నాటి అనుభవాలతో జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ప్రభుత్వం తరుపున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. ఇప్పటికే రెండు అమలు చేశామని, ఈనెల 27వ తేదీన మరో రెండు పథకాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి కీలక హామీలు చేవెళ్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారని చెప్పారు. తమ మంత్రివర్గం మానవీయ కోణంలో పనిచేస్తుందని, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని, ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతామని ధీమాగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ప్రియాంక అల, సింగరేణి సిఅండ్ ఎండి బలరాం నాయక్, కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావుతో పాటు వివిధ యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. జిఎం షాలెం రాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News