ఎంత పెంచుతామన్నది త్వరలో చెబుతాం
కాంగ్రెసోళ్లు రూ.4వేల పింఛన్ ఇస్తమంటున్నరు
వారి పాలనలోని చత్తీస్‌గఢ్, కర్నాటకలో ఇస్తున్నారా?
50 ఏళ్లు అధికారమిస్తే కాంగ్రెస్ ఏం చేసింది?
ఐదు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి.. తొమ్మిదేళ్లలో చేసి చూపించాం : సూర్యాపేటలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే పెన్షన్లు ఖచ్చితంగా పెంచుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. పెన్షన్లు ఎంతకు పెంచుతామో త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు. ప్రజలు ఆగమాగం కావద్దని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. రూ. 4వేల వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న చత్తీస్‌గఢ్, కర్నాటకలో రూ. 4వేల పెన్షన్ ఇస్తున్నారా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. పెన్షన్ పెంచడం మాకు చేతకాదా? త్వరలోనే పెన్షన్ పెంపు పై నిర్ణయం తీసుకుంటామన్నారు.ఆదివారం సూర్యాపేట వేదికగా కేసీఆర్ సమర శంఖారావం పూరించారు.
సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఐదు దశాబ్దాలలో జరగని అభివృద్ధి బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం తొమ్మిదేళ్ల కాలంలోనే చేసి చూపించామని సిఎం అన్నారు. ఎన్నో సంక్షేమ పధకాలు, ప్రాజెక్టులను తీసుకు వచ్చి బంగారు తెలంగాణ కలసాకారం చేశామన్నారు. మరోసారి ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే మరిన్ని అద్భుతాలు చూసి చూపిస్తామని అన్నారు.తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకనే అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు తెలిసిందన్నారు. రాష్ట్రం అందరి కృషితోనే అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సూర్యాపేటలో నూతన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిచుకున్న జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని పేర్కొన్నారు.
అంచెలంచెలుగా సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నాం. ఒక పార్టీ నాయకుడు మోటార్లకు మీటర్ పెట్టాలంటాడు. మరోపార్టీ నాయకుడేమో 3 గంటలే ఉచిత కరెంట్ చాలంటాడు. కాంగ్రెస్ గెలిచిన కర్నాటకలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని చెబుతోంది. ధరణి పోర్టల్ తీసేస్తే రైతుబంధు, రైతుబీమా ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక్కసారి ధరణిలో భూమి నమోదైతే మార్చే మార్చేమొనగాడు లేడని అన్నారు. ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఆలోచించి వాడుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీలు హామీలను గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్లీ పైరవీకారుల రాజ్యం వస్తుందన్నారు. 50సంవత్సరాలు అధికారం అనుభవించిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. వారి పాలనలో వృద్దాప్య పెన్షన్ 200రూపాయలు ముఖాన కొట్టారని అన్నారు. ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావద్దు, బీఆర్‌ఎస్ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించుకున్నామని, ఇందులో అధికారుల కృషి ఎంతో ఉన్నదని, అందుకు వారిని అభినందిస్తున్నానని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో 23వ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తలసరి ఆదాయంలో మనం దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నామని సీఎం తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.సుస్థిరాభివృద్ధి సూచీలో కూడా మనం నెంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు, సెక్రెటేరియట్‌లు కూడా సరిగ్గా లేవని, మీ జిల్లాలో కలెక్టరేట్ అంత కూడా లేదండి మా సెక్రెటేరియట్, అసెంబ్లీ అని కొందరు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో పస్తులు ఉండే పరిస్థితి లేదని చెప్పారు. ఒకప్పుడు ఫ్లోరైడ్‌తో విలవిల్లాడిన రాష్ట్రం.. ఇప్పుడు జీరో ఫ్లోరోసిస్ స్టేట్‌గా మారిందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారు. రైదుబంధు, రుణమాఫీతో పాటు, విత్తనాలు సక్రమంగా దొరుకుతున్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణ పల్లెలు అభివృద్ధితో కళకళలాడుతున్నాయి. 37వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని సీఎం స్పష్టం చేశారు. దేశానికే తెలంగాణ రైతుగర్వకారణంగా మారారు.రాష్ట్రం ధాన్యం భాండాగారంగా మారింది. 3కోట్ల టన్నులు పండించి పంజాబ్‌ను అధగమించిన ఘనత తెలంగాణదేనని సీఎం కేసీఆర్ అన్నారు. రైస్ మిల్లులు సరిపోవడం లేదు. ప్రభుత్వం కోటి టన్నుల ధాన్యం విక్రయించిందన్నారు. ఇక భూ బకాసురుల ఆటలు కట్టించడానికే ధరణి ప్రారంభించాము. ఒకసారి ధరణిలోకి రికార్డయితే ఎవరూ మార్చలేరని అన్నారు.
సూర్యాపేటలో గతంలో ఎన్నో రకాల అలర్జీభీమారీలు వచ్చేవి. నేడు శుద్ధమైన తాగునీటిని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయితీకి 10లక్షలు, సూర్యపేట మున్సిపాలిటీకి 50కోట్లను ముఖ్యమంత్రి ఈసందర్భంగా ప్రకటించారు. జిల్లాలోని దామెరచర్లలో 30వేల కోట్లతో అల్ట్రా పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాము. ఈసారి ఉమ్మడి జిల్లాలోని 12సీట్లలో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యే సీట్లను గెలిచినట్టేనని అన్నారు. ఎన్నికల్లో ఈసారి గతంలోకంటే బీఆర్‌ఎస్‌కు ఐదారు సీట్లు ఎక్కువే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో పలు జిల్లాల్లో వలసలు తగ్గుముఖం పట్టాయన్న ముఖ్యమంత్రి పోయిన వాళ్లు కూడా తిగిరి వస్తున్నారని అన్నారు. రుణమాఫీతో పాటు రైతుబంధు, ఎంబీసీలకు అవసరమైన పనిముట్లకు డబ్బుసాయం అందుతుందని హామీ ఇచ్చారు. ఎవరెన్ని కధలు చెప్పినా ఈసారి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.