Friday, January 24, 2025

దేశంలో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం

- Advertisement -
- Advertisement -

హామీల అమలులో కేంద్రం మొడి వైఖరి
పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్య
అఖిల భారత కిసాన్ సభ వెల్లడి

మనతెలంగాణ /హైదరాబాద్:  దేశంలో రైతు ఉద్యమాలు ఉధృతం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యలపై పోరాటాల్లో కలిసొచ్చే రైతులను చైతన్యం కలిగించాలని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతన్నకి అనేక హామీలు ఇచ్చిందని అన్నారు. అందులో స్వామినాథ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి కనీసం మద్దతు ధర నిర్ణయిస్తాం, విత్తనాలు ఎరువులు సబ్సిడీతో తక్కువ ధరకు ఇస్తాం, అంత నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా పరిహారం చెల్లిస్తాం, తక్కువ వడ్డీతో పంట రుణం ఇస్తాం లాంటి హామీలు బిజెపి ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు.

పది సంవత్సరాలలో ప్రభుత్వం లెక్కల ప్రకారం లక్ష మందికి పైగా రైతులు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇదే కాలంలో మూడు లక్షల మంది వలస కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. యువకులు నిరుద్యోగులు 50వేల కు పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ లెక్కలలో కౌలు రైతులు, మహిళలు, కార్మికుల, నిరుద్యోగుల లెక్కలు నిర్దిష్టంగా లేవని అన్నారు. ప్రపంచంలో ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కడ జరగలేదని అన్నారు. వరి సాగు చేస్తున్న రైతులకు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే గత సంవత్సరం 13వేల కోట్లు నష్టం జరిగిందని అన్నారు. రైతులకు సీ2 ప్లస్ 50శాతం ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని అన్నారు.

పత్తి పంట తెలంగాణలో చూస్తే ఒక క్వింటాలుకు పదివేల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. అధిక వర్షాలు, కరువు కారణంగా లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరుగుతుందని అన్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ఈ సమస్యలపై స్పందించాలని కోరారు. ఈ సమస్యలు ఒక తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి మరింత పెరుగుతుందని అన్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని గుర్తు చేశారు. దేశంలో పాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. అందుకు రైతు సంఘాలు బలపడాలని కోరారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నాటికి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగిందని గుర్తు చేశారు. అదేమిటంటే క్రికెట్ మ్యాచ్ లో భారత్ సెమీఫైనల్ గెలిచింది. ఫైనల్ లో కూడా భారత్ గెలుస్తుందని అందరూ కోరుకున్నారు కానీ ఓడిపోయింది. అలాగే వచ్చే ఎన్నికల్లో బిజెపిని, దాని మద్దతుదార్లను ఓడించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ తెలంగాణలో డిసెంబర్ 4 నుంచి 7 మధ్య మిచౌంగ్ తుఫాను వలన 4.75 లక్షల ఎకరాలలో పంటలు నష్టం జరిగిందన్నారు. కానీ రైతులకు ఎటువంటి నష్టపరిహారం కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. రైతు భరోసా నిధులను యాసంగి పంటల కొరకు తక్షణం విడుదల చేయాలని కోరారు. నిధుల పంపిణీకి బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ నిబంధనలు రూపొందించాలని అన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. ధరణిలో ఉన్న లోపాలను సరిచేసి భూయజమన్య హక్కులు కల్పించాలని అన్నారు. రైతుల సమస్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఆయా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని అన్నారు.

ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహా రెడ్డి, ప్రొఫెసర్ అరిబండీ ప్రసాద రావు, బొంతల చంద్రారెడ్డి,మాదినేని రమేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న, సహాయ కార్యదర్శి కందాల ప్రమీల, మూడ్ శోభన్, కున్న రెడ్డి నాగిరెడ్డి,అన్నవరపు సత్యనారాయణ, డి. బాల్ రెడ్డి, ఎం శ్రీనివాసులు, బాలరాజు గౌడ్, పల్లపు వెంకటేష్, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,బండ శ్రీశైలం,కందాల శంకర్ రెడ్డి, అశోక్,యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News