మోడీ హయాంలో 22 మందికే సంపద దోపిడీ
14-15 మందికి జల్, జమీన్, జంగల్ ధారాదత్తం
రాహుల్ గాంధీ ఆరోపణ
చైబస(జార్ఖండ్): గిరిజనులకు చెందిన జల్(నీళ్లు), జంగల్(అడవులు), జమీన్(భూమి)ను పారిశ్రామికవేత్తలకు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. జార్ఖండ్‌లోని చైబసలో ఒక ఎన్నికల ప్రచార సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కోట్లాదిమంది ప్రజలను లక్షాధికారులను చేస్తానని వాగ్దానం చేశారు. రాజ్యాంగాన్ని, గిరిజనులు, పేదలు, వెనుకబడిన వరాగల హక్కులను రక్షించేందుకే ఈ లోక్‌సభ ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సైతం ఇండియా కూటమి నాయకులు సిద్ధమని ఆయన ప్రకటించారు. గిరిజనులకు చెందిన జల్, జంగల్, జమీన్‌ను 14-15 మంది పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన 10 సంవత్సరాల పాలనలో ఆయన కేవలం 22 మందిని మాత్రమే కోటీశ్వరులను చేశారని రాహుల్ తెలిపారు. అయితే తాము అధికారంలోకి వస్తే కోట్లాదిమందిని లక్షాధికారులను చేస్తామని, పేద మహిళలకు ఏటా రూ. 1 లక్ష అందచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.