Sunday, September 8, 2024

పాలకులుగా కాదు.. సేవకులుగా ఉంటాం

- Advertisement -
- Advertisement -

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పెంచారు : రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : తాము పాలకులుగా కాదనీ, సేవకులుగా ఉంటామని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పెంచారని, భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తిని నింపారని ఆయన తెలిపారు. మానవ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. ప్రతిపక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బిఆర్‌ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలుపును కెటిఆర్ స్వాగతించారని, వారి స్పందనను స్వాగతిస్తున్నానన్నారు. తాను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపించామన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావుల సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన తెలిపారు.
డాక్టర్ అంబేడ్కర్ ప్రజాభవన్‌గా మారుస్తాం
ప్రగతి భవన్ పేరు మారుస్తామని, దానిని డాక్టర్ అంబేడ్కర్ ప్రజాభవన్‌గా మారుతుందన్నారు. సామాన్యులకు కూడా అందులోకి ప్రవేశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సచివాలయం గేట్లు కూడా అందరికీ తెరుచుకుంటాయని రేవంత్ స్పష్టం చేశారు. ఏ సమస్య వచ్చినా సహకరించిన రాహుల్ గాంధీకి ఆయనకృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణతో తమది కుటుంబ అనుబంధమని చెప్పి రాహుల్ గాంధీ ప్రజల్లో విశ్వాసం నింపారన్నారు. రాహుల్ గాంధీ అండతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ మాణిక్ రావు ఠాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంలో తన పాత్ర పోషించిన విజయశాంతికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత తెలిపే అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటుకు అందరినీ ఆహ్వానిస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం అప్పగించి తమపై మరింత బాధ్యతను పెంచారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు హేతుబద్ధంగా వాదించేందుకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుందన్నారు. ప్రజల తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి విపక్షాలతో పాటు అందరినీ ఆహ్వానిస్తామని ఆయన చెప్పా రు. కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆచార్య కోదండరామ్ సలహాలు, సూచనలు తీసుకొని ముందకెళ్తామన్నారు. కాంగ్రెస్ గెలుపుపై ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు.
కాంగ్రెస్ విజయం అమరవీరులకు అంకితం
రేపటి భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2004 నుంచి 20-14 మధ్య కాలంలో అందించిన ప్రజా పాలన అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విజయం అమరవీరులకు అంకితం చేస్తామన్నారు. వాళ్ల ఆకాంక్షలను నెరవేర్చుతామన్నారు. పేదల బతుకులు బాగుపడేందుకు కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం సంతోషకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ప్రజల జీవితాలను బాగు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే చర్యలకు అన్ని పార్టీలు కలిసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News