Thursday, December 19, 2024

కాళేశ్వరంపై విచారణ

- Advertisement -
- Advertisement -

వచ్చేవారం ప్రాజెక్టుల సందర్శన
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంపై విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయిన అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ ప్రాజెక్టు సందర్శనకు వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా బాధ్యులైన అధికారులతోపాటు ఏజేన్సీ నిర్వాహకులు కూడా పర్యటనలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికార బాధ్యతలు చేపట్టిన మంత్రి జలసౌధలో తొలిసారి నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ.ఏన్.సి మురళీధర తో పాటు ఉన్నతాధికారులు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రాజెక్టుల వారీగా సమీక్ష చేశారు.

ప్రాజెక్టులకు అవుతున్న విద్యుత్ వినియోగంతోపాటుగా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టు లపై లోతుగా సమీక్ష నిర్వహించారు.ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నామని, మనం పూర్తిగా బాధ్యత యుతంగా, జవాబు దారి తనంతో పని చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు .తెలంగాణలో నీటి పారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉందని ,అది గుర్తు పెట్టుకొని మనం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీటి పారుదల పనులలో మూడో పార్టీ చెక్ ఉండాలన్నారు. ప్రజల్లో నీటి పారుదల రంగంపై ఉన్న అపోహలు తొలగిపోయేలా పని చేయాలని సూచించారు.

అధికారులతో సమీక్షా సమవేశం అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించారు.సమావేశపు వివరాలను మీడియాకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. నదీజలాల్లో నీటివాటా విషయమై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు. పెండింగ్ ఉన్న ప్రాజెక్టు లను పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని 40వేల చెరువుల నిర్వహణ గురించి తమ ప్రభుత్వం శ్రద్ద వహిస్తుందన్నారు. వివిధ ప్రాజెక్టుల్లో పనుల నాణ్యతపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రజల డబ్బుతో జరిగే పన్నుల్లో గోప్యత ఉండరాదన్నారు. ప్రాజెక్టుల్లో పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో నీటిపారుదల శాఖది కీలక పాత్ర అని వెల్లడించారు. ఎవ్వరు డిసైన్ చేసిన ,ఎవ్వరు నిర్మాణం చేసిన బాధ్యలను చెయ్యాల్సి ఉంటుందన్నారు. కొత్త ఆయకట్టు వివరాలు ఇవ్వమని అధికారులను ఆదేశించామని తెలిపారు. కోట్లాది ప్రజలు విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశం అంతా పారదర్శకంగా ఉంటుందన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రి తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రాదాన్యత ఇస్తామని, అవసరమైన ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి తో చర్చించి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News