Monday, November 18, 2024

అమ్మవారి కుంకుమ భరిణె అంత పవిత్రంగా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడుకుంటాం

- Advertisement -
- Advertisement -

జాతరను విజయవంతం చేయడంలో సహకరించిన సిఎంకు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు
పర్యాటక, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల కుంకుమ భరిణె అంత పవిత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను పొత్తిళ్ళలో పెట్టుకుని కాపాడుకుంటామని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మంత్రి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. జాతర ఏర్పాట్లు, నిర్వహణలో అన్ని శాఖలు పరస్పర సహకారంతో, సమన్వయంతో వ్యవహరించి, చిత్తశుద్ధిని కనబరచి ఈ మహా జాతరను దిగ్విజయవంతంగా పూర్తి చేసాయని మంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జాతర పనులను ముందు నుండే ప్రణాళికాబద్ధంగా చేపట్టడంతో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకొని, మొక్కులు చెల్లించుకొని, సంతృప్తితో తిరుగు ప్రయాణమయ్యారని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం భక్తులకు అడుగడుగునా అన్ని వసతులను కల్పించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కోట్లాదిగా పోటెత్తిన ఈ మహాజాతరలో తెలిసీ తెలియక భక్తులు ఏమైనా ఇబ్బందులకు గురైతే పెద్ద మనసుతో క్షమించాలని మంత్రి విన్నవించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మొదటిసారి మేడారం జాతర నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను పూర్తి నిష్టతో చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అమ్మవారి దయతో అనారోగ్యాన్ని జయించి, త్వరగా కోలుకొని అమ్మవార్లు గద్దెలకు చేరుకున్నాక దర్శించుకునే భాగ్యం కలిగిందని మంత్రి అన్నారు. సమ్మక్క సారలమ్మల దయ తెలంగాణ ప్రజల పై సదా వుండాలని ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News