సౌతాఫ్రికా ప్రభుత్వం హామీ
కేప్‌టౌన్: తమ దేశంలో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు పూర్తి ఆరోగ్య భద్రత కల్పిస్తామని దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ప్రస్తుతం తమ దేశంలో కరోనా కొత్త వెరియంట్ విజృంభిస్తున్నా..ఇండియాఎ జట్టును వెనక్కి పిలవక పోవడంపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. క్లిష్ట సమయంలోనూ భారత క్రికెట్ బోర్డు తమ జట్టును స్వదేశానికి పిలవక పోవడం సాహసోపేత నిర్ణయమని పేర్కొంది. ఇక తమపై బిసిసిఐ ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతామని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియాఎతో పాటు త్వరలో తమ గడ్డపై సిరీస్ ఆడనున్న టీమిండియాకు పూర్తి భద్రత కల్పిస్తామని తెలిపింది.
సిరీస్ సజావుగా సాగేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని వివరించింది. ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న ఇండియాఎ జట్టుతో పాటు సీనియర్ టీమ్‌కు కూడా పూర్తి ఆరోగ్య రక్షణ కల్పిస్తామని పేర్కొంది. దీని కోసం పటిష్టమైన బయోబబుల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇదిలావుండగా దక్షిణాఫ్రికా సిరీస్ కోసం టీమిండియా డిసెంబర్ 9న బయలుదేరి వెళ్లనుంది. కాగా ఈ సిరీస్ కోసం టీమిండియాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేగాక కరోనా కొత్త వెరియంట్ విజృంభణ నేపథ్యంలో ఈ సిరీస్ ఉంటుందా లేదా అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.