Sunday, January 19, 2025

మణిపూర్‌లో శాంతి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: రాహుల్ భరోసా

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో శాంతి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం
పార్లమెంట్‌లో పూర్తి శక్తితో పోరాడతాం
మణిపూర్ ప్రజలకు రాహుల్ భరోసా

న్యూఢిల్లీ: మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించి, ఈ విషాదాన్ని అంతం చేయడానికి కాంగ్రెస్, ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై పూర్తి శక్తితో ఒత్తిడి తీసుకువస్తాయని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జాతుల మధ్య ఘర్షణతో సంక్షుభితంగా మారిన మణిపూర్‌లో గత సోమవారం పర్యటించిన రాహుల్ గాంధీ గురువారం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా మణిపూర్‌ను సందర్శించి అక్కడి ప్రజల ప్రజలను ఆలకించి శాంతి కోసం పిలుపునిచ్వాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. మణిపూర్ ప్రజలతో తాను జరిపిన సంభాషణలకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన రాహుల్ మణిపూర్‌లో గత ఏడాది ఘర్షణలు చెలరేగిన తర్వాత తాను మూడు సార్లు ఆ రాష్ట్రాన్ని సందర్శించానని తన పోస్టులో తెలిపారు.

దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఆ రాష్ట్రంలో పరిస్థితిలో ఎటువంటి మార్పురాలేదని, నేటికీ రాష్ట్రం రెండు భాగాలుగా చీలిపోయిందని ఆయన చెప్పారు.ఇళ్లు దగ్ధమవుతున్నాయని, అమాయక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వేలాది కుటుంబాలు బలవంతంగా సహాయ శిబిరాలలో ఉండాల్సి వస్తోందని రాహుల్ తెలిపారు. ఈ సంక్షోభాన్ని ముగించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పూర్తి శక్తితో పార్లమెంట్‌లో తమ గళం వినిపిస్తామని ఆయన తెలిపారు. వివిధ సహాయ శిశిరాలలో తలదాచుకున్న నిర్వాసితులు తమ గోడును రాహుల్ వద్ద వెళ్లబోసుకోవడం ఆ వీడియోలో కనిపించింది. తమ కోసం పోరాడాలని, తమ గొంతును పార్లమెంట్‌లో వినిపించాలని వారు రాహుల్‌ను అభ్యర్థించారు.

మణిపూర్ ప్రజల సమస్యలను తమ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించిన విషయాన్ని రాహుల్ వారికి తెలిపారు. రానున్న బడ్జెట్ సమావేశాలలో తమ పూర్తి శక్తితో మీ సమస్యలు తెలియచేస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని వారికి ఆయన చెప్పారు. మీకు సాయపడగలను..మీ సమస్యను లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలను. కాని మీరు ఎప్పుడు మీ ఇళ్లకు తిరిగి వెళ్లగలరో మాత్రం నేను హామీ ఇవ్వలేను. ఎందుకంటే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పగలదు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మీ గొంతును వినిపిస్తాను అని ఆయన వారికి హామీ ఇవ్వడం ఆ వీడియోలో కనిపించింది. గత ఏడాది మే 3న మణిపూర్‌లోని మైతీ, కుకీ తెగల మధ్య హింస ప్రజ్వరిల్లి 200 మందికి పైగా మరణాలకు దారితీసింది. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వందలాది ప్రైవేట్, ప్రభుత్వ భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News