Wednesday, November 20, 2024

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగించి దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు రిజర్వేషన్ల కోటాను కాంగ్రెస్ పెంచుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని రత్నాంలో ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికల్లో పోరాడుతున్నామని చెప్పారు.

రాజ్యాంగాన్ని అంతం చేయాలని, మార్చాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. జల్(నీరు), జంగల్(అడవులు), జమీన్(భూమి)పై రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చిందని, ఆ హక్కులను తొలగించాలని, సంపూర్ణ అధికారం తన వద్దనే ఉంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని రాహుల్ ఆరోపించారు.

ఈసారి ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ కారణంగానే 400కి మించి సీట్లు కావాలంటూ బిజెపి నాయకులు నినాదాలు ఇస్తున్నారని, అయితే 400 మాట అటుంచి కనీసం 150 సీట్లు కూడా ఆ పార్టీకి రావని ఆయన జోస్యం చెప్పారు. రిజర్వేషన్లు తొలగిస్తామని వారు అంటున్నారని, కాని 50 శాతానికి మించి మీకు రిజర్వేషన్లు పెంచుతామని తాను ఈ వేదిక నుంచి హామీ ఇస్తున్నానని రాహుల్ తెలిపారు.

పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీలకు అవసరమైన మేరకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఆదివాసీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన వార్తలను మీడియా చూపించదని ఆయన ఆరోపించారు. మీ పిల్లలను అత్యాచారం చేస్తారు..మీ భూమిని లాక్కుంటారు..కాని మీడియా ఈ వార్తలను రాయదు. ఇందుకు కారణం ఉంది. ఈ మీడియా కంపెనీలలో ఆదివాసీలు లేరు అని రాహుల్ ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వాన్ని 90 మంది బ్యూరోక్రాట్లు నడుపుతున్నారని ఆయన చెప్పారు. బడ్జెట్‌లను వారే పంపిణీ చేస్తారు. 90 మందిలో ఒకరే ఆదివాసీ. ముగ్గురు వెనుకబడిన తరగతులకు చెందిన వారు.

దళిత వర్గాలకు చెందిన వారు ముగ్గురు. మీకు చెందిన వారు మీడియాలో కాని కార్పొరేట్ ప్రపంచంలో కాని లేరు. దీన్ని మార్చాలని మేము భావిస్తున్నాము. అందుకే కులగణన, ఆర్థిక సర్వే జరిపించాలని నిర్ణయించుకున్నాము అని రాహుల్ తెలిపారు. రైతులకు వారి పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, రుణ మాఫీ చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. తాము ఇస్తున్న హామీలు ఇవేనని, వీటితో మీ జీవితాలు మార్చివేస్తామని ఆయన ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల నాలుగవ దశలో మే 13న రత్లాంలో పోలింగ్ జరగనున్నది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి కాంతిలాల్ భూరియా పోటీ చేస్తుండగా బిజెపి తరఫున అనితా నగర్ సింగ్ చౌహాన్ పోటీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News