Sunday, December 22, 2024

హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తాం

- Advertisement -
- Advertisement -

మూడోసారి కూడా మేమే కచ్చితంగా అధికారంలోకి వస్తాం !
‘తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటైన ‘ది తెలంగాణా జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ ప్రతినిధులతో ఆయన ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. సొసైటీ సభ్యత్వ వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మూడోసారి కూడా తామే కచ్చితంగా అధికారంలోకి వస్తామని మంత్రి హరీశ్  రావు ధీమా వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హౌసింగ్ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు.

తాను, మంత్రి కెటిఆర్ కలిసి ఇదే అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడుతామని ఆయన వెల్లడించారు. కోర్టు కేసుల కారణంగా హైదరాబాద్‌లో జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించడం ఆలస్యమైందని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్రం ఏర్పడ్డ తరవాత కోర్టు కేసు పరిష్కారం కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ ను పెట్టి, ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేసి, జడ్జిమెంట్ జర్నలిస్టులకు అనుకూలంగా వచ్చేందుకు సహకరించామని ఆయన తెలియజేశారు.మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు కాగానే, జర్నలిస్టు హౌసింగ్ సమస్యను ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కొత్త, పాత సొసైటీల్లోని సభ్యులకు కలిపి ఒకేసారి ఇళ్ల స్థలాలను కేటాయించే దిశలో ముఖ్యమంత్రి కెసిఆర్ తో మాట్లాడుతామని ఆయన చెప్పారు. జిల్లాల్లో ఇప్పటికే మెజారిటీ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. అదే క్రమంలో హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు సైతం ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News