ఖమ్మం: గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులు చాలా కష్టాలు పడ్డారని ఐ అండ్ పిఆర్ , రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పత్రికా స్వేచ్ఛను గత పదేళ్లుగా అణచేశారన్నారు. విలేకరులపై దాడులు జరుగకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టాన్ని తెస్తామని కూడా ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్లు అందజేయడానికి త్వరలో ఓ పాలసీ అమలుచేస్తామన్నారు. టియూడబ్ల్యుజె(ఐజెయూ) రాష్ట్ర సమావేశానికి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ విషయాలు తెలిపారు. ‘‘ మాజీ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు జర్నలిస్టులను నిర్లక్ష్యం చేశారని, కానీ పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మీడియాకు అనుకూలంగా వ్యవహరించారు’’ అన్నారు.
‘‘ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర పోషించారు. బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ కేవలం వాగ్దానాలే చేశారు తప్ప జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించలేదు. ఆయనవన్నీ శుష్క వాగ్దానాలే. ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేటాయించిన భూమిని హైదరాబాద్ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీకి త్వరలో అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన జివో వారం లేక 10 రోజుల్లో విడుదలచేయొచ్చు. మండలాలు, జిల్లాల్లో, హైదరాబాద్ లోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ఓ పాలసీ తీసుకురానున్నాము. జూన్ లో ముగిసే అక్రిడిటేషన్ వ్యాలిడిటీని మరో మూడు నెలలు పెంచనున్నాము. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణకు సంబంధించిన అన్ని కమిటీలను త్వరలో పునురుద్ధరిస్తాం’’ అని పొంగులేటి తెలిపారు.