Monday, December 23, 2024

బాసర విద్యార్థులకు భరోసా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బాసర ఆర్‌జియుకెటి విద్యాలయంలోని విద్యార్థులు ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డిలు పేర్కొన్నారు. విదార్థులు ఎలాంటి ఆందోళన బాటపట్టకుండా తరగతులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పేర్కొన్న సమస్యల పరిష్కారానికై బుధవారమే జిల్లా కలెక్టర్‌ను ఆర్‌జియుకెటి విద్యాలయానికి పంపించామని చెప్పారు. అత్యవసరం అనుకున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టరు సూచించామని మంత్రులు తెలిపారు. అదేవిధంగా మిగిలిన సమస్యలను కూడా ప్రాధాన్యాతా పరంగా పరిష్కరించాలని ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్‌కి సూచించామని పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాసర ఆర్‌జియుకెటి విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో బుధవారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలు సమీక్ష నిర్వహించారు.

ప్రతిభ కలిగిన వేలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్‌జిటియుకెటి విద్యాలయంలో విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే మంత్రులుగా విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. ఈ విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, విద్యార్థులు తరగతులకు హాజరుకావాలని కోరారు. విద్యా విషయాల్లో రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయవద్దని సూచించారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎ విఠల్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ వెంకటరమణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిఠల్, బాసర ఆర్‌జియుకెటి ఇంఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News