Sunday, January 19, 2025

విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తాం

- Advertisement -
- Advertisement -
అధ్యాపకుల పదవీవిరమణ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రిని కలుస్తా
రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల అసోసియేషన్ ఆవిర్భావం
విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : వినోద్‌కుమార్

హైదరాబాద్:  రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న విశ్వవిద్యాలయాల, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ఓయూ ఆర్ట్ కళాశాలలో జరిగిన రాష్ట్ర విశ్వవిద్యాలయాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ కొన్ని అంశాలపై వారం రోజుల్లోనే సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసి, ఇందుకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అధ్యాపకుల నియామకాల అంశం రాష్ట్రపతి పరిధిలో ఉందని తిరిగి శాసనసభలో బిల్లు పెట్టే విషయమై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పదవీవిరమణ వయస్సు పెంచే విషయాన్ని సమర్థించిన ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. అనుభవం కలిగిన అధ్యాపకులు పదవీవిరమణ పొందడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు.

సీపీఎస్ విషయంలోనూ అతిత్వరలో పరిష్కరిస్తామని, పీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రయత్నించటంతో పాటు ఆరోగ్య కార్డుల కోసం కూడా ప్రభుత్వంతో మాట్లాడుతానని వివరించారు. 15 రాష్ట్ర విశ్వవిద్యాలయాల తరఫున సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తానని పేర్కొన్నారు. భావజాలంతో సంబంధం లేకుండా విద్యార్థులకు రాజకీయ బాగస్వామ్యం లేకుండా కుట్రజరుగుతోందని దీని పర్యవసానాలు భవిష్యత్తు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఎన్నికలు ఉండాల్సిందేనన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు. అన్ని విశ్వవిద్యాలయాలు జట్టుగా ఏర్పడి సమస్యలతో పాటు సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలపై చర్చాగోష్టులు జరపాలని సూచించారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు సహా విభిన్న రంగాల్లో సాధించిన అభివృద్ధిని అధ్యాపకులకు వివరించారు. అనంతరం ఔటా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జి. మల్లేశం ప్రసంగిస్తూ ఐక్యంగా విశ్వవిద్యాలయాల సమస్యల పరిష్కారం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. అధ్యాపకుల నియామకాలు, సీపీఎస్, పదవీవిరమణ వయోపరిమితి పెంపు, యూజీసీ బకాయిల విడుదల, ఆరోగ్యకార్డుల జారీ తదితర అంశాలపై విపులంగా మాట్లాడారు. అధ్యాపకులతో పాటు విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపు పెంచి, మౌళికవసతుల కల్పనకు సహకారం అందిచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నత విద్యా సవాళ్లు, సమస్యలు, పరిష్కారాలు సహా సామాజిక, ఆర్థిక, సమకాలీన అంశాలపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నీ ఒకే గొంతుకను వినిపించేందుకు నూతన వేదికను ఈ సమావేశం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆల్ యునివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమావేశం వెల్లడించింది. త్వరలోనే కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ప్రొఫెసర్ విద్యాసాగర్, అప్పారావు, చెన్నప్ప, కాశీం, మాధవిలత, రబింద్రనాథ్ సోలొమన్, జమీల్, సబీనాహెరాల్డ్, వై. ప్రశాంతి, అలియా బేగం, మహెందర్ రెడ్డి, సైదానాయక్, మద్దిలేటి హాజరయ్యారు. ఔటా నుండి ప్రొఫెసర్ సరస్వతమ్మ, సూర్యాధనుంజయ్, సీహెచ్ శ్రీనివాస్, చలమల్ల వెంకటేశ్వర్లు, జెవి వెంకటేశ్వర్ రావు, మంగు, లావణ్య, నర్సింహులు, తదితరులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News