బాసర రైల్వే స్టేషన్ తనిఖీలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
హైదరాబాద్: బాసర రైల్వే స్టేషన్‌ను మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సందర్శించారు. వేద విద్యార్థుల వేద మంత్రోచ్చరణల మధ్య జిఎంకు ఘనస్వాగతం పలికారు. బాసర పుణ్యక్షేత్రం మీదుగా ప్రత్యేక రైళ్లు నిలిపేలా కృషి చేయాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జిఎం గజానన్ మాల్యాను కోరారు. 10 కెడబ్ల్యుపి గ్రిడ్ టైడ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను గజానన్ మాల్య ఈ సందర్భంగా ప్రారంభించారు. కోవిడ్ 19 కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లను నెలలోపు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా జిఎం తెలిపారు. డిసెంబర్‌లోపు బాసర రైల్వేస్టేషన్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారు. సుమారు గంటపాటు బాసర రైల్వే స్టేషన్లో ఆయన పర్యటించారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిఎం గజానన్ మాల్య నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ ఆయన ప్రయాణికుల వసతులపై సమీక్షించారు స్టేషన్ పరిసరాలను, అక్కడ ఆయన మియావాకి చెట్ల పెంపకాన్ని, స్టేషన్ రికార్డుల డిజిటలైజేషన్ మొదలగు వాటిని జిఎం తనిఖీ చేశారు. జనరల్ మేనేజర్ నిజామాబాద్ వద్ద నూతన సిసిటివి గదిని, ఎస్ఎస్ఈ/సిగ్నల్ కార్యాలయం, ఆధునీకరించిన అధికారుల వసతిగృహం, రన్నింగ్ రూమ్‌లోని డైనింగ్ హాల్‌తో సహా అనేక సౌకర్యాలను జిఎం ప్రారంభించారు.