Friday, December 20, 2024

గ్రామీణ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తాం

- Advertisement -
- Advertisement -

ప్రతి గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చర్యలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో, సిఎం రేవంత్రెడ్డి సారధ్యంలో రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో ఏ చిన్న గ్రామంలో చూసినా విఆర్‌ఏ లేదా విఆర్‌ఓ.. ఎవరో ఒక్కరు గ్రామంలో ఉండే వారన్నారు. గత ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పులను బయటకు లీక్ చేస్తారని ఆ వ్యవస్థనే భ్రస్టు పట్టించి గాలిలో పెట్టి .. చివరకు నేడు ఆ వ్యవస్థనే లేకుండా చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఆ ఉద్దేశంతో లేదన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఉద్యోగస్తుడికి ఒకటో తేదీ నుంచి 5 లోపే జీతం అకౌంట్లల్లో పడేలా చూడటం ప్రభుత్వ ధ్యేయమన్నారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ ఆదివారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగింది.

డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..గత ప్రభుత్వంలో వ్యక్తి స్వచ్ఛను హరించారని ఆరోపించారు. సామాన్యుడే కాదు.. ఏ ఉద్యోగి కూడా మాట్లాడే పరిస్థితి లేదని,స్వేచ్ఛగా తన గాలి తను పీల్చుకునే అవకాశం కూడా లేదన్నారు. స్వేచ్ఛ కావాలి, ప్రెండ్లీ ప్రభుత్వం కావాలి.. అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ఉద్యోగస్తులందరూ భావించడంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా రెవెన్యూ సెక్టార్..
ఎవరో ఒక్కరో ఇద్దరో తప్పు చేస్తే మిగతా ఉద్యోగులను ఇబ్బందులు పెట్టిన సందర్బాలు కొక్కొల్లాలుగా ఉన్నాయన్నారు. కనీసం ప్రజలు చెప్తున్న దానిని కూడా వినే వ్యవస్థ గ్రామ స్థాయిలోలేకుండా మంత్రి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారధులుగా ఉన్న వారు రెవెన్యూ ఉద్యోగులే అన్నారు.గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం టోటల్ గా ఎత్తేసిన కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులను ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా తెలిపారు.

ధరణితో  ప్రజల్లో మార్పు
ధరణి అనే ఒక పోర్టల్‌ను తీసుకొచ్చి ప్రజలను కొత్త ఇబ్బందులకు గురి చేశారని రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వంలో సంస్కరణలు, మార్పులు అవసరమన్నారు. ఏ సంస్కరణలు చేసినా, ఏ మార్పులు తెచ్చిన కొద్ది మంది వ్యక్తుల కోసం సంస్కరణలు చేయవద్దన్నారు. సామాన్య ప్రజలకు, పేదవాడికి, గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యక్తులకు మనం చేసే సంస్కరణలు ఉపయోగ పడాలన్నారు. మనం తీసుకొచ్చే చట్టాలు సామన్య ప్రజలకు మేలు చేయాలన్నారు. కానీ చట్టం చేసే హక్కు , సంస్కరణలు తీసుకొచ్చే అధికారం నాకు ఉందని ఆనాడున్న నాయకులు భావించారన్నారు. ధరణిలో సమస్యలు, సామాన్యులు పడుతున్న ఇబ్బందులు.. తుది ఫలితం ఆనాటి ప్రభుత్వం మార్పు కావాలని ప్రజల్లో బలంగా ఏర్పడిందన్నారు.

ధరణి ప్రక్షాళనతో సామాన్యులకు మేలు..
ధరణిని, ధరణిలో ఉన్న లోసుగులను, ధరణిలో గత ప్రభుత్వ చేసిన తప్పులను, ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకు మేలు చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో సీఎం, మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు కాదు.. ప్రభుత్వంలో ఉద్యోగస్తులందరూ కూడా భాగస్వాములేనన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే.. మొదట ఆ మంచి పేరు దక్కేది ఉద్యోగస్తులకేన్నారు. మీ అందరికీ మంచి పేరు వస్తే.. సీఎంకు, మంత్రులకు, అందరికీ మంచి పేరు వస్తుందన్నారు.
ధరణి లొసుగులతో ప్రభుత్వ భూములు మాయం..
ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, దోపిడీలు, భూకబ్జాలు వీటిన్నిటికి చెక్కు పెట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.ధరణిని ప్రక్షాళన చేసి, దీనిలో గత ప్రభుత్వంలో ఏ విధమైన తప్పులు జరిగాయో, ధరణితో ఎవరైతే న్యాయంగా భూములను కోల్పోయారో వారికి న్యాయం చేస్తామన్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి భూములను కాపాడిన, ఆ నాటి రెవెన్యూ ఉద్యోగులను కాదని, ధరణి చట్టం  లొసుగును అడ్డం పెట్టుకొని తాతలు, తండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తులను … గత ప్రభుత్వం ఆ ఆస్తులను వారి తొత్తులకు కట్టపెట్టిందని ఆయన ఆరోపించారు.

ఇందిరమ్మ రాజ్యంలో అందరి సహకారంతో మంచి జరుగుతుందని కోట్లాది ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎవరికీ నష్టం జరుగకుండా మంచి చేసే విధంగా ఉద్యోగులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పేదల కష్టాలలో అందరం భాగస్వాములు కావాలన్నారు. మీ ఉద్యోగుల కష్టాలలో నేను భాగస్వామ్యం అవుతానన్నారు. పూర్తి విశ్వాసంతో కష్టపడి మీకు ప్రభుత్వానికి మంచి జరిగే విధంగా పని చేయాలని మనస్ఫూర్తిగా కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, సెక్రటరీ జనరల్ రమేష్ రాథోడ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వెంకట్రెడ్డి, పద్మప్రియ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్, ఆరేటి రాజేశ్వర్, , పుష్యమి, ఎస్పీఆర్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News