* కామారెడ్డి నియోజకవర్గంలోని 10 పంచాయతీల్లో తీర్మానాలు
* నామినేషన్ ఖర్చులకు ఒక్కొక్క గ్రామం నుంచి పదివేలు విరాళం
* ఎంఎల్‌సి కవితకు తీర్మానాలు అందజేత
మనతెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు కెసిఆర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సిఎం కెసిఆర్‌కే ఓట్లు వేస్తామంటూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని మాచారెడ్డి మం డలంలో ఉన్న ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, నడిమి తండా, వెనుక తాండ, బోడగుట్ట తండా, మైస మ్మచెరువు, రాజ్‌ఖాన్‌పేట, వడ్డెర గూడెం, గుంటి తండా, దేవునిపల్లి గ్రామపంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి.శనివారం రోజున మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో కలిసి సంబంధిత తీర్మాన ప్రతులను అందించారు.
భారీ మెజార్టీతో గెలిపించాలి
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. కామారెడ్డి నుంచి సిఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు సిఎం కెసిఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఆ నిర్ణయం వల్ల రెండు నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నూతన ఉత్సాహం వచ్చిందని అన్నారు. సిఎం పోటీ చేయడం వల్ల కామారెడ్డి జిల్లా కే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ తోపాటు పొరుగున ఉన్న నాలుగైదు జిల్లాలు అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతాయని తాను విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు. నిజామాబాద్ బిడ్డగా సిఎం కెసిఆర్ కామారెడ్డి లో పోటీ చేయడానికి తాను స్వాగతిస్తున్నానని, అందరిలానే తనకు కూడా ఉత్సాహంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తోందని, ఏకగ్రీవ తీర్మానాలు చేసిన పది గ్రామాల ప్రజలకు కవిత ధన్యవాదాలు తెలియజేశారు.
షబ్బీర్‌ను నమ్మేపరిస్థితి లేదు
కారుకు ఎదురు లేకుండా సాగిపోయేటట్టుగా ఈ 10 గ్రామాల ప్రజలు ఉత్సాహాన్ని ఇచ్చారని, ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తే మరింత అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో గంప గోవర్ధన్ కేసీఆర్ ను ఆహ్వానించారని వివరించారు. తెలంగాణలో మూడోసారి కూడా కారుకు ఎదురుండదని కవిత అన్నారు.పార్టీలకు అతీతంగా మాచారెడ్డి మండలంలోని గ్రామపంచాయతీలు తీర్మానం చేశాయని, షబ్బీర్ అలీ వంటి వారు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కెసిఆర్‌ను పార్టీలకు ,కులాలకు, మతాలకు అతీతంగానే చూస్తారని తేల్చి చెప్పారు. కామారెడ్డి లోని సబ్బండ వర్గాల ప్రజలు కెసిఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కెసిఆర్ బోలా శంకరుడు అని,ఆయన చేతికి ఎముకంటూ ఉండదని, కాబట్టి కామారెడ్డి తో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ గెలుపుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈనెల 28న భారీ సమావేశం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈనెల 28న కామారెడ్డిలో భారీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని కవిత తెలిపారు.
కెసిఆర్‌కే ఓట్లేస్తాం
- Advertisement -
- Advertisement -
- Advertisement -