మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని మంత్రి పురపాలక, ఐటి, పరిశ్రమ శాఖ కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, నగరాలు నుంచి గ్రామీణప్రాంతాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తో న్న ఏకైకా రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అసెంబ్లీ లో శుక్రవారం పద్దులపై జరిగిన చర్చలో మంత్రి కెటిఆర్ సగర్వంగా వివరించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం నుంచి పాత్రికేయ వర్గాలకు కూడా అన్ని విధాలుగా సహకరిస్తూ వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదని, తెలంగాణను పిచ్చివాళ్ళ చేతిలో పెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కెటిఆర్ చెప్పారు.
ఐటి పరిశ్రమలను ఒక్క హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా ఐటి హబ్‌లోను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఐటి రంగంలో 26 శాతం వృద్ధి రేటును తెలంగాణ సాధించిందన్నారు. తెలంగాణ ఏర్పాడకముందు 3.23 లక్షల ఐటీ ఉద్యోగులు ఉండగా, ఈరోజు 8 లక్షల 70 వేల మంది కార్పోరేట్ సంస్థల్లో ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని చెప్పారు. కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో ఇప్పటికే ఐటీ టవర్స్ నిర్మించామన్నారు. వరంగల్‌లో ఐటీ పార్క్‌లో టెక్‌మహేంద్ర జెన్కో వంటి సంస్ధలు ఉన్నాయన్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ పట్టణాల్లో ఐటి హబ్‌లను ఏ ర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. అమెజాన్ క్యాంపస్, గుగూల్, ఆపిల్, ఫేస్‌బుక్, మెట్రోనిక్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు.
ఐటిపిఆర్ రద్దుపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటు బిజెపి నేతలు విసిరిన సవాల్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. ఐటిఐఆర్‌ను 2013 జూన్ 26న హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఏర్పాటు చేయాలని అప్పటి యుపిఎ ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటిఐఆర్ లాంటి మంచి ప్రాజెక్టును అమలు చేయాలని కేంద్రాన్ని కోరగా ఇప్పటివరకు ఏమీ సమాధానం చెప్పలేదన్నారు. ఐటిఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి కర్ణాటక రాష్ట్రానికి సహరిస్తున్నారు కానీ తెలంగాణకు ఎందుకు సహకరించడం లేదని కేంద్రాన్ని ఆయన నిలదీశారు. మాట్లాడితే ప్రగతిభవన్ కూల్చేయండి అని ఒకరు, సచివాలయాలన్ని కూల్చేయండి అని మరొకరు మాట్లాడతారు కానీ తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులు గురించి కేంద్రాన్ని బిజెపి ఎంపిలు ఎందుకు నిలదీయరాని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణకు పెట్టుబడుల వరద
సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణకు పెట్టుబడులు వరదలా వస్తున్నాయని మంత్రి కెటిఆర్ చెప్పారు. టిఎస్ ఐపాస్ ద్వారా 3లక్షల 36వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు.కొత్తగా ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. జహీరాబాద్‌లో రూ.1000 కోట్లతో ఎలక్ట్రికల్ వెహికిల్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు ఉపాధి శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటికే 22 లక్షల మంది యువత ఆయా రంగాల్లో పత్యక్షంగా ఉద్యోగాలు సాధించారని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క డేటా సెంటర్‌కు 72వేల కోట్ల 24 లక్షల పెట్టుబడులు వచ్చాయన్నారు. వాటిలో అమెజాన్ వెబ్ సర్వీస్ రూ.33 వేల కోట్లు, మెక్రోసాఫ్ట్ రూ.32 వేల కోట్లు, ఎయిర్ టెల్ రూ.2వేల కోట్లు, కెపిటల్ ల్యాండ్ రూ.12వేల కోట్లు వరకు పెట్టుబడులు పెట్టాయన్నారు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీస కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కేంద్రం ఇవ్వడం లేదని అన్నారు.
దీంతో చేవెళ్ళ నియోజకవర్గంలో ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో పెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు.2014లో ఖాళీగా ఉన్న బీడు భూములను పారిశ్రామిక ప్రాంతాలుగా తీర్చిదిద్దామన్నారు. దండమల్కాపూర్, ఆదిభట్ల , తుమ్మలూరు వంటి ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి చేపట్టామన్నారు. ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ తయారీపరిశ్రమ సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేశామన్నారు. ఆదిభట్లలో ఎయిరోస్పేస్ పార్కు, రాయదుర్గంలో నాలెడ్జ్ సెంటర్లు ఉన్నాయన్నారు.
మున్సిపల్ సేవలు థ్యాంక్స్ లెస్
మున్సిపల్ సేవలు థ్యాంక్స్ లెస్ అని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రజల కోసం పురపాలకశాఖ సిబ్బంది ఎంతపని చేసినా ఎక్కడో ఓ చోట పని కనిపిస్తూనే ఉంటుందన్నారు. పట్టణ ప్రగతి కింద హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలలో సుమారు రూ. 15.90 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అధికార ప్రతిపక్షం ఎంఎల్‌ఎ అనే భేదం లేకుండా అన్ని మున్సిపాలటీలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టామన్నారు. మార్కెట్లు, దోభీఘాట్‌లు, వైకుంఠధామాలు, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలలో ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేయడం వలన రూ. 250 కోట్లు ఆదా చేశామన్నారు. శానిటరీ వర్కర్స్‌కు మూడు సార్లు వేతనాలను పెంచిన ఘతన కెసిఆర్ సర్కార్‌కే దక్కుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ కింద తెలంగాణకు కేంద్రం 26 అవార్డులు వచ్చాయన్నారు. అవార్డులైతే ఇస్తున్నారు కానీ నిధులు మాత్రం కేంద్రం నుంచి రావడం లేదన్నారు. గుజరాత్‌లో వరద వస్తే వెళ్ళే సాయం చేసే ప్రధాన మోడీ తెలంగాణకు మాత్రం సాయం చేయడం లేదని మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో 47 అండర్ పాస్ బ్రిడ్జిలు, వెయ్యివరకు నర్సరీలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్నారు.
అలాగే హైదరాబాద్‌లో కొత్త జంక్షన్లు, అర్బన్ పార్కులు,చెరువులను అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. బస్తీ దావాఖానాలను ఏర్పాటు చేయడంతో పాటు కరోనా సమయంలో పేదలకు ఉచితంగా భోజనాలను అందజేశామన్నారు. మున్సిపాలటీలలో జంతువు సంరక్షణ కోసం యానిమల్ హాస్పటల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో భారత్ బెంజ్ వాహనాలతో చెత్తను జవహర్‌నగర్ డంపుయార్డుకు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం 20 మెగావాట్ల విద్యుత్ చేస్తుందని, భవిష్యత్‌లో దీన్ని 100 మెగావాట్లకు అభివృద్ధి చేస్తామన్నారు. రూ. 250 కోట్లతో లెజర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ తో పాటు 500 మెట్రిక్ టన్నుల డెమోలేషన్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఎస్‌ఎన్‌డిపి కింద హైదరాబాద్‌లోని నాలాలను రూ.980 కోట్లతో ఆధునీకరిస్తున్నామని ఆయన వెల్లడించారుఇ. ఎస్‌ఎన్‌డిపి కింద నాలాలను బాగు చేస్తుంటే కేంద్రం ఏలాంటి సాయం అందించడం లేదన్నారు. నమామి గంగే కాదు మూసీనది బాగు చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. సురక్షితమైన సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ చేరుకునేందుకు లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ చెప్పారు.
ఒత్తిడి చేస్తే బొగ్గు దిగుమతి చేసుకుంటామా?
విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఒత్తిడి తెస్తే చేసుకుంటామా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని డిస్కామ్‌ల కోసం దేశీయ బొగ్గు కాకుండా విదేశీ బొగ్గును 4రెట్లు దిగుమతి చేసుకోవాలని కేంద్రం చెప్పడం పద్దతి కాదన్నారు. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్ళి తన వారికోసం బొగ్గుగనులు వచ్చేలా చేశారని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రిలా ఆయన దోస్తుల కోసం తాము ఎక్కడా పనిచేయడం లేదన్నారు. సింగరేణి సంస్థ ఆరుసార్లు పిఎల్‌ఆర్ అవార్డులు సాధించిందని, అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేస్తుందన్నారు. గుజరాత్‌లోని మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు గనులను ఇస్తారు కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కును తుక్కుకింద ఎందుకు అమ్ముతున్నారో ఇక్కడ బిజెపి ఎంపిలు కేంద్రాన్ని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.
16 ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్స్
వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని 16 ప్రాంతాల్లో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యూహాత్మక రైతుబంధు వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరిగిందన్నారు. మత్సరంగం అభివృద్ధిలో భాగంగా అక్వాహబ్‌లను ఏర్పాటుకే వేలాది కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టామన్నారు. దీంతో 11 వేల కోట్ల రూపాయల మేర మత్స ఉత్పత్తులు పెరగడంతో పాటు మత్యకారుల సంపద మెరుగుపడిందన్నారు. గొర్రెలు, మేకలు వంటి జీవల సంఖ్య పెరిగిందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయడెయిరీ లాభాల బాటలో పయనిస్తుందని ఆయన చెప్పారు.
ఓనర్లు అవుతోన్న నేత కార్మికులు
నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వలన వారి వలసలు తగ్గి ఓనర్లుగా మారారని మంత్రి కెటిఆర్ తెలిపారు. నేత కార్మికులకు రూ.30 కోట్ల వ్యక్తిగత రుణాలు ఇచ్చామని, అలాగే రెండు వేల మందికి సూక్ష్మనిధి కింద రుణాలను అందజేస్తునామని ఆయన చెప్పారు. నూలుమీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని అన్నారు. నేతకార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా ఇస్తున్నామని అన్నారు. వరంగల్‌లో మేగా టెక్స్‌టైల్స్ పార్కులో ఎనిమిది పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, వాటి ద్వారా సుమారు 25 వేలమంది మహిళలకు ఉపాధి లభించనుందని ఆయన చెప్పారు. గడిచిన ఎనిమిదేళ్ళ కాలంలో చేనేత రంగంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహిస్తోందని ఆయన ఆరోపించారు. చేనేత ఉత్పత్తులపై ఐదు కాదు 12 శాతం పన్ను పెంచాలని ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.ఈ ప్రయత్నం విరమించుకుని జీరో బడ్జెట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మేగా పవర్‌లూమ్‌ను కమలాపురంలో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినప్పటికీ స్పందించడం లేదన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో పథకాలు
రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని మంత్రి కెటిఆర్ చెప్పారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం 16,337 మందికి అక్రిడేషన్ కార్డులను ఇచ్చిందన్నారు. కోవిడ్ సమయంలో మరణించిన జర్నలిస్టులకు రూ.6 కోట్ల సాయం చేశామన్నారు. మీడియా అకాడమీ ద్వారా 5900 మంది జర్నలిస్టులకు రూ.17 కోట్లు ఆర్ధికసాయం చేశామన్నారు. అలాగే రూ.2034 కోట్లను జర్నలిస్టుల వైద్యఖర్చు నిమిత్తం అందజేశామన్నారు. ఏదైనా ప్రమాదంలో క్షతగాత్రులైన జర్నలిస్టులకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల పిల్లలు ఎల్‌కెజి నుంచి పదవ తరగతి వరకు చదువుకునేందుకు రూ.1000 కోట్లు ట్యూషన్ ఫీజు చెల్లిస్తున్నామని చెప్పారు. విదేశాల్లో జర్నలిజం కోర్సు చేసేవారికి రూ. 5లక్షల వరకు సహాయం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.