Monday, December 23, 2024

పాఠశాలల్లో హిజాబ్‌పై నిషేధం సరైనదే

- Advertisement -
- Advertisement -

Wearing hijab is not religiously obligatory:Karnataka Highcourt

ముస్లిం విద్యార్థుల హిజాబ్‌ధారణ ఇస్లాం మతపరంగా తప్పనిసరి కాదు : కర్నాటక హైకోర్టు తీర్పు
తీర్పుపై భిన్నస్పందనలు, ముస్లిం సంస్థల అసంతృప్తి, సుప్రీంకోర్టులో అప్పీల్

బెంగళూరు: కర్నాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టుమంగళవారం తుది తీర్పు వెలువరించింది.హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరికాదని పేర్కొం ది. విద్యాసంస్థల్లో మతపరమైన వస్త్రధారణపై రాష్ట్రప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థించింది. ఈ మేరకు ఈ అంశంపై దాఖలయిన పిటిషన్లను కొట్టివేసింది. విద్యాసంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో యూనిఫామ్‌ను ధరించాలని నిర్దేశించడం సహేతుకమైన పరిమితేనని ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్థి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. హటాత్తుగా అదీ విద్యాసంవత్సరం మధ్యలో హిజాబ్ వివాదం ఎలాపు ట్టుకొచ్చిందన్న అనుమానం వ్యక్తం చేసిన ధర్మాసనం దీని వెనుక అసాంఘిక శక్తుల హస్తం ఉండి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్‌లను ధరించి వచ్చిన విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించని కాలేజి ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కాలేజి అభివృద్ధి కమిటీ చైర్మన్( స్థానిక ఎంఎల్‌ఎ), వైస్ చైర్మన్‌లను తొలగించాలన్న విద్యార్థినుల అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు దాఖలయిన పిటిషన్లన్నిటినీ సమగ్రంగా విచారించిన చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జెఎం కాజిలతో కూడిన ధర్మాసనం వాటిని మంగళవారం కొట్టివేసింది. కాగా హైకోర్టు తీర్పు కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని రాష్ట్రప్రభుత్వం కోరింది.

అంతేకాకుం డా విద్యార్థులకు చదువు అన్నిటికన్నా ముఖ్యమని పేర్కొంది. కాగా హైకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైందని ముస్లిం విద్యార్థుల సంఘం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( సిఎఫ్‌ఐ)పేర్కొంటూ, ముస్లింల రాజ్యాంగపరమైన, వ్యక్తిగత హక్కులను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని పేర్కొంది. విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై గత నెల కర్నాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో హిజాబ్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. మరోవైపు హిజాబ్ వస్త్రధారణను అనుమతించాలని, ఉడుపి, కుందాపూర్ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత జస్టిస్ కృష్ణదీక్షిత్‌తో ఏర్పాటైన ఏకసభ్య ధర్మాసనం విచారించగా.. ఆ తర్వాత విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనిపై ఫిబ్రవరి 10న విచారణ ప్రారంభించిన ధర్మాసనం 15 రోజులపాటు వాదనలు వినింది. ఇదే సమయంలో సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ధర్మాసనం మంగళవారం తుది తీర్పు వెలువరింది. కాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం బెంగళూరు సహా పలుప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఈ నెల 19 వరకు ఈ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఉడుపిలో మంగళవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

కాగా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఓ ముస్లిం విద్యార్థిని ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.

ప్రతి ఒక్కరూ కోర్టు తీర్పును పాటించాలి: బసవరాజ్ బొమ్మై

మరో వైపు హైకోర్టు తీర్పుపై కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పం దించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు. శాంతిభద్రతను పరిరక్షిస్తూనే .. పిల్లల భవిష్యత్తును, వాళ్ల చదువులను పరిరక్షించే ప్రయత్నం చేస్తామని అన్నారు. కోర్టు తీర్పుపై కర్నాటక విద్యామంత్రి బిసి నగేశ్ హర్షం వ్యక్తం చేశారు.‘ ప్రభుత్వం వైఖరిని కోర్టు సమర్థించినందుకు సంతోషంగా ఉంది. కోర్టుకు వెళ్లిన అమ్మాయిలు తీర్పును పాటించాలని అభ్యర్థిస్తున్నాను. ఇతర విషయాలకంటే చదువు ముఖ్యం’ అని ఆయన అన్నారు.

ముస్లిం సంఘాల అసంతృప్తి

కాగా కర్నాటక హైకోర్టు తీర్పుపై పలు ముస్లిం సంఘాలతో పాటుగా జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.‘ ఓ పక్క మహిళల సాధికారత గురించి మాట్లాడుతున్నాం. మరో పక్క వారి వారి చిన్న కోరికలను కాదంటున్నాం. హిజాబ్ అనేది కేవలం మతానికి సంబంధించిది మాత్రమే కాదు, వారి హక్కుకు సంబంధించినది’ అని మెహబూబా ముఫ్తీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా తాను ఎలాంటి దుస్తులు ధరించాలో ఒక ముస్లిం మహిళకున్న ప్రాథమిక హక్కును హైకోర్టు నిరాకరించిందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

కేరళ గవర్నర్ హర్షం

తిరువనంతపురం: హిజాబ్ వస్త్ర ధారణ ఇస్లాం మత తప్పనిసరి సంప్రదాయం కాదంటూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, ముస్లిం మహిళలను తిరిగి ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేయడానికి జరిగే ఇలాంటి ప్రయత్నాలు ఫలించవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News