ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడిపోతోంది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా మధ్యాహ్నాం అయ్యేసరికి చల్లగా అయిపోతోంది. ఇది తూర్పుగాలుల ప్రభావం, ఉపరితల ద్రోణి కారణమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు గాలులతో ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, ఉత్తర కోస్తా ఆంధ్రా తీరం వరకు ఉపరితల ద్రోణి బలహీన పడిందని అధికారులు తెలిపారు. శుక్రవారం ఆగ్నేయ బంగళాఖాతం పరిసర ప్రాంతాల్లోని శ్రీలంక, తమిళనాడు తీరాల్లో ఉన్న అల్పపీడనం శనివారం కూడా కొనసాగుతోందన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 3.1 కి.మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి స్థిరంగా కొనసాగుతూ ఉందని అధికారులు తెలిపారు. రాగల మూడు, నాలుగు రోజుల్లో పశ్చిమ దిశ వైపు నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉందని, ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు చల్లటి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మూడురోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.