హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో మయన్మార్, బంగ్లాదేశ్‌పై మేఘాలు కమ్ముకున్నాయని, ఆదివారం తెలుగు రాష్ట్రాలు కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో ఏపీ, తెలంగాణల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నల్గొండ, హైదరాబాద్, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శనివారం సాయంత్రం రాష్ట్రంలోని పలు చోట్ల వర్షం కురిసింది. నల్గొండ జిల్లా ఘన్‌పూర్‌లో 71, యాదాద్రి భువనగిరి జిల్లా నందన్‌లో 53, ఖమ్మం జిల్లా లింగాలలో 43, రావినూతల, తిమ్మారావుపేటలో 42, మధిరలో 39, రంగారెడ్డి జిల్లా బోడకొండలో 39 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది.
ఏపీలో ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. సోమవారం కోనసీమ, పశ్చిమగోదావరి, చిత్తూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.