హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అయిపోయాయి. వాగులు, చెరువులు పొంగుతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. మరో 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయవ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం మరింత తీవ్రమై వాయుగుండంగా మారే అవకాశం. ఉత్తరాంద్ర, ఒడిశా తీరాల వైపు వాయుగుండం కదిలే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. గంటలకు 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరంగల్, హన్మకొండ, మహబాబాబాద్ జిల్లాకు రెడ్ అలర్డ్ జారీ చేసింది. గతవారం రోజులుగా హైదరాబాద్ తో పాటు జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో కుండపోత, కుంభవృష్టి కాదు… అంతకు మించి వానలు పడనున్నాయని తెలుస్తోంది. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదైంది.