సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరానికి శుక్రవారం తెరలేవనున్న విషయం తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌భారత్ జట్ల మధ్య చారిత్రక పోరు జరుగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. దీంతో ఇరు జట్ల క్రికెటర్లతో పాటు అభిమానుల్లో, మ్యాచ్ నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తున్న సౌతాంప్టన్‌లో ఆరు రోజుల పాటు సాధారణం నుంచి అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖతో పాటు పలు వెబ్‌సైట్లు అభిప్రాయపడుతున్నాయి. వాతావరణం వివరాలు తెలియజేసే వెబ్‌సెట్లలో దాదాపు 80 శాతం ఫైనల్ జరిగే ఆరు రోజుల్లో వర్షం పడడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. రోజ్‌బౌల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్‌లో వరల్డ్‌కప్ తరహాలో చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నారు. ఈసారి అందరి అంచనాలు తారుమారు చేస్తూ భారత్‌తో పాటు న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు సమరోత్సాహంతో ఎదురు చూస్తున్నాయి. ఇటు భారత్, అటు న్యూజిలాండ్ జట్టులోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో ఫైనల్ సమరం రసవర్తంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఈ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉందని వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇరు జట్లలోనూ కలవరం మొదలైంది. ఇప్పటికే ఐసిసి ముందు జాగ్రత్తగా రిజర్వ్‌డేను కూడా ప్రకటించింది. కానీ సౌతాంప్టన్‌లో రానున్న కొన్ని రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడం ఖాయమని వాతావరణ శాఖ తేల్చి చెప్పడంతో అసలు ఫైనల్ జరగడంపైనే అనుమానాలు నెలకొన్నాయి. తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్, కివీస్‌లు భారీ ఆశలతో సిద్ధమయ్యాయి.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చిరస్మరణీయ విజయం సాధించిన కివీస్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టీమిండియా కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఒక వేళ వర్షం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడితే రోజ్‌బౌల్ పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌లకు ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్లలో ఒకటిగా పేరున్న కివీస్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడం టీమిండియా బ్యాట్స్‌మెన్‌లకు కష్టంతో కూడుకున్న విషయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ట్రెంట్ బౌల్ట్, జెమీసన్, సౌథి, వాగ్నర్ తదితరుల నుంచి భారత బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఇక భారత్‌లోనూ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బుమ్రా, షమి, ఉమేశ్, సిరాజ్, ఇషాంత్‌లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. మొత్తం మీద ఒకవేళ వాతావరణం ప్రతికూలంగా మారితే ఇరు జట్ల బౌలర్లు చెలరేగి పోవడం ఖాయమనే చెప్పాలి.
Weather Forecast: Rain likely to spoil WTC Final