Friday, November 22, 2024

ఈ రెండు నెలల్లో ఊరూరా పెళ్లి సందడి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు.. ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. జీవించు నూరేళ్లు.. ఇలా ఊరూరా పెళ్లి సందడి నెలకొంటోంది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు నెలల్లో పెళ్లి సందడి ప్రారంభం కానుండడంతో కల్యాణ మంటపాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, గుళ్లు, ఇలా వివాహవేడుకలతో కనువిందు చేయనున్నాయి. మే, జూన్ నెలల్లో పెళ్లిళ్లకు అనువైన తేదీలను పండితులు ప్రకటించడంతో పెళ్లిళ్లకు ముహూర్తాలను పెట్టుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం మే, జూన్ నెలలో భారీగా పెళ్లిళ్లు జరగ్గా, ఈసారి కూడా ఈ రెండు నెలల్లో మంచి ముహూర్తాలు కుదరడంతో అన్ని ప్రాంతాల్లో పెళ్లి సందడి కనిపించనుంది.

శుభకార్యాలతో లక్షలమందికి ఉపాధి

పెళ్లిళ్లు ఊపందుకోవడంతో పాటు ఇతర అన్ని రకాల శుభకార్యాలకు అనువైన రోజులను పండితులు ప్రకటించడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి కల్యాణ మంటపాలు, కేటరింగ్, వంటవాళ్లు, పురోహితులు, ఫొటో, వీడియో గ్రాఫర్లకు, ట్రావెల్స్, కార్లు, బస్సులు, ఐస్ క్రీమ్, మినరల్ వాటర్, ఈవెంట్ మేనేజ్ మెంట్లు, పూలు, డెకరేషన్, లైటింగ్, కూరగాయలు, కిరాణా, కిళ్లీ, వస్త్ర దుకాణాలు, బంగారు, వెండి ఆభరణాల షాపులు, మాంసలు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్టీలు, సాంస్కృతిక కళాకారులతో పాటు పలు విభాగాల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి లభించనుంది.

ఇప్పటికే పెళ్లిళ్లు కుదిరిన వారందరూ ముందస్తు బుకింగ్‌లు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పరోక్షంగా వీటికి అనుబంధంగా ఉన్న రంగాల్లోని లక్షల మందికి శుభకార్యాల ద్వారా ఉపాధి లభించనుంది. ప్రస్తుతం పంక్షన్‌హాళ్లతో పాటు ఈవెంట్ మేనేజ్ మెంట్లు, ఫొటో, వీడియో గ్రాఫర్లు సైతం తమ పారితోషకాన్ని పెంచడంతో ఈసారి పెళ్లిళ్లకు భారీ ఖర్చులు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిన్న పంక్షన్‌హాల్‌కు లక్ష రూపాయల వరకు అద్దెను వసూలు చేస్తుండగా వీడియో గ్రాఫర్, ఫొటోగ్రాఫర్‌లు లక్షకు పైచిలుకు పారితోషకాన్ని వసూలు చేస్తున్నారు. దీంతోపాటు డెకరేషన్ చేసే వాళ్లు పెరిగిన పూల ధరల నేపథ్యంలో పారితోషకాన్ని అమాంతం పెంచేశారు.

పెళ్లిళ్లతో పాటు ఉపనయనాలు, గృహ ప్రవేశాలు

పెళ్లిళ్లతో పాటు ఉపనయనాలు, గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ట వంటి శుభకార్యాల నిర్వహణకు మంచి ముహూర్తాలున్నాయని పండితులు పేర్కొంటున్నారు. మే, జూన్ నెలల్లో పెళ్లిళ్లకు అనువైన తేదీలను పండితులు ప్రకటించారు. మే నెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 29, 30 తేదీలలో, జూన్ నెలలో 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27లలో మంచి మహూర్తాలు ఉన్నట్లు వారు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News