అమ్మాయికీ, అబ్బాయికీ పెళ్లి కుదరడం, పెళ్లి జరుగుతుండగా అబ్బాయి తరఫువారు కట్నం కోసం పట్టుబట్టడం.. అమ్మాయి తండ్రి కట్నం డబ్బులు ఇవ్వలేకపోవడంతో ఆ పెళ్లి ఆగిపోవడం- ఇదంతా పాతకాలపు సినిమాల్లో చాలాసార్లు చూశాం. ఇప్పుడు రోజులు మారిపోయాయి అనుకుంటున్నారేమో.. ఏమీ మారలేదనడానికి వారణాసిలో జరిగిన తాజా సంఘటనే నిదర్శనం. ట్విస్ట్ ఏంటంటే- పెళ్లి పందింట్లో అందరూ గొడవపడుతుంటే.. ఎంచక్కా పెళ్లి కొడుకూ, పెళ్లి కూతురూ లేచిపోయి, గుళ్లో పెళ్లి చేసుకోవడం!
వారణాసిలో ఓ పెళ్లి జరుగుతోంది. అచ్చం సినిమాల్లో చూపించినట్లే అబ్బాయి తరఫువారు కట్నం కోసం పట్టుబట్టారు. అమ్మాయి తండ్రి డబ్బు సర్దుబాటు కాలేదన్నాడు. దాంతో ఇరుపక్షాలవారి మధ్య గొడవ మొదలైంది. ఇదే సందుగా పెళ్లి కొడుకూ, పెళ్లి కూతురు నెమ్మదిగా అక్కడినుంచి జారుకున్నారు. ఓ స్కూటర్ ఎక్కి జామ్మంటూ గుడికి వెళ్లిపోయి అక్కడ పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి దుస్తుల్లో వారిద్దరూ వారణాసి వీధుల్లో వెళ్తున్న వీడియో ఇన్ స్ట్రాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి ‘వారణాసిలో ఏదైనా సాధ్యమే’ అంటూ కేప్షన్ పెట్టడం ఆకట్టుకుంటోంది.