ముంబయి నిర్మానుష్యం.. ఇళ్లకే ప్రజలు పరిమితం
ముంబయి: వేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర అంతటా అమలు చేస్తున్న మొదటి వారాంతపు లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ముంబయి, పుణె, ఔరంగాబాద్, నాగపూర్‌తోసహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో శనివారం కూడా వీధులు, మార్కెట్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అయితే..ముంబయిలోని కొన్ని మార్కెట్ ప్రాంతాలలో మాత్రం ప్రజలు భౌతిక దూరాన్ని విస్మరించి సరకుల కొనుగోలు కోసం పెద్ద ఎత్తున గుమికూడుతున్నట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన మొదటి వారాంతపు లాక్‌డౌన్ సోమవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుంది.
గత ఆదివారం వారాంతపు లాక్‌డౌన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు మిగిలిన రోజుల్లో రాత్రిపూట కర్ఫూ ఉంటుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక పగటి వేళల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని కూడా ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చేపట్టిన ఈ కార్యాచరణ ప్రణాళిక ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా దక్షిణ ముంబయిలోని కొన్ని ప్రాంతాలు పూర్తి నిర్మానుష్యంగా మారాయి. అయితే సెంట్రల్ ముంబయిలోని కొన్ని మార్కెట్ ప్రాంతాలు, తూర్పు ముంబయిలోని శివారు ప్రాంతాలలో మాత్రం ప్రజలు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి బయట తిరుగుతున్నట్లు ఆధికారులు గుర్తించారు. దాదర్ కూరగాయల మార్కెట్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడుతూ మాస్క్‌లు కూడా లేకుండా తిరుగుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వైన్‌షాపుల ముందు పెద్ద సంఖ్యలో మద్యంప్రియులు బారులు తీరుతున్నారు. ప్రజలు నిబంధనలు పాటించేలా చూసేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని ముంబయి పోలీసులు నియమించారు.