Monday, December 23, 2024

“స్వాగతం బడ్డీ”… చంద్రయాన్ 3 ల్యాండర్ నుండి ప్రత్యేక సందేశం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: 2019లో చంద్రయాన్ 2 మిషన్‌లో భాగంగా పంపించిన ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆర్బిటర్‌తో చంద్రయాన్ 3కి చెందిన ల్యాండర్ మాడ్యూల్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం విజయవంతంగా అనుసంధానించ గలిగారు. ఈమేరకు ఇస్రో ఓ ట్వీట్ చేసింది.

‘వెల్‌కమ్ బడ్డీ’ అంటూ ఆ మెసేజ్‌లో పోస్ట్ చేశారు. చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యూల్‌ను అధికారికంగా చంద్రయాన్ 2 ఆర్బిటర్ స్వాగతించింది. ఈ రెండిటి మధ్య టూవే కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్టు ఇస్రో తెలిపింది. ఈ రెండిటి మధ్య పరస్పర సమాచార మార్పిడి వ్యవస్థ స్థాపితమైంది. ల్యాండర్ మాడ్యూల్‌ను చేరుకునేందుకు బెంగళూరు లోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్కింగ్ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయని ఇస్రో పేర్కొంది. మరోవైపు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం 5.20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది.

అదే రోజు సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపనున్నట్టు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా చంద్రయాన్ 2 మిషన్‌ను భారత్ 2019లో చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లతో కూడిన జీఎస్‌ఎల్వీ మార్క్ 111 ఎం1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది చంద్రుడి కక్షలోకి ఆగస్టు 20న ప్రవేశించింది. అయితే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చివరి క్షణాల్లో విఫలమైంది. కానీ, ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్ మాత్రం చందమామ కక్షలో విజయవంతంగా తిరుగుతోంది. దానిలో సరిపడా ఇంధనం ఉందని, మరో ఏడేళ్లు సేవలు అందించడానికి ఇది సరిపోతుందని ఇస్రో అప్పట్లోనే తెలియజేసింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3లో భాగంగా ఆర్బిటర్‌ను పంపలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News