Saturday, January 4, 2025

కొత్త వత్సరమా, స్వాగతం!

- Advertisement -
- Advertisement -

కాలచక్ర భ్రమణంలో మరో సంవత్సరం ఎన్నో తీపి గుర్తులను, మరెన్నో విషాదభరిత ఆనవాళ్లనూ మిగిల్చి చరిత్రలోకి జారిపోయింది. కొత్త ఆశలనూ, ఆకాంక్షలనూ మోసుకుంటూ మరో సంవత్సరం ముందుకొచ్చింది. గడచిన రాత్రి మిన్నంటిన సంబరాల మధ్య ప్రపంచం యావత్తూ పాత వత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకుంది. మంచీ చెడూ నాణెంపై ఉన్న బొమ్మా బొరు సూ వంటివి. విజయాలను వెన్నంటే అపజయాలు, కష్టాలను అనుసరించి సుఖాలు రావడం సహజం. అలా చూసుకుంటే, గడచిన ఏడాది భారత్ ఎన్నో విజయాలను అందిపుచ్చుకుంది. మరెన్నో అపజయాలనూ మూటగట్టుకుంది.

అంతరిక్షం మొదలుకుని క్రీడారంగం వరకూ భారత్ అనేక విజయాలను అందుకున్న సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోతుంది. గడచిన ఏడాదిని ఎన్నికల సంవత్సరంగా అభివర్ణిస్తే అతిశయోక్తి లేదు. ఇండియాతోపాటు అమెరికా, పాకిస్తాన్, యుకె, శ్రీలంక తదితర 60కి పైగా దేశాల్లో ఎన్నికలు జరిగాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రంలోనూ కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చా యి. గత రెండు పర్యాయాలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన పూర్తి మెజారిటీని సాధించిన ఎన్డీయే ఈసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. తెలంగాణలో బిఆర్‌ఎస్ ను ఓడించి, కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడితే, ఏపీలో అఖండ మెజారిటీతో టిడిపి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దశాబ్దకాలం తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిందీ ఈ సంవత్సరమే. ఈ ఏడాది భారత విజయాలు అంతరిక్ష పరిశోధన కేంద్రంతోనే మొదలై, దానితోనే ముగియడం విశేషం.

జనవరి 1న ఎక్స్-రే పోలారిమీటర్ శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించడంద్వారా 2024లో భారత విజయాలకు నాంది పలికిన ఇస్రో, ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న స్పేస్ డాకింగ్ ఎక్సపెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టి, అరుదైన ఘనతను సాధించింది. పశ్చిమాసియా, రష్యా-, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా ప్రపంచదేశాల ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు గురైనా, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధిరేటు 8.2 శాతం నమోదు చేయడం భారత్ సాధించిన అద్భుత విజయమని చెప్పవచ్చు. సెప్టెంబర్ నాటికి విదేశీ మారక నిల్వ ల్లో ఇండియా ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకోవడమూ ఓ విశేషమే. స్టాక్ మార్కెట్లోనూ భారతీయ కంపెనీలు దూసుకుపోయాయి. ఐపిఓల ద్వారా భారతీయ కంపెనీలు 1.6 లక్షల కోట్లను సమీకరించాయి.

ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 778 బిలియన్లకు చేరుకున్నాయి. ఏళ్లతరబడి కొనసాగిన వివాదాలకు తెరదించుతూ అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తి చేసుకున్నది. భారత పురుషుల జట్టు టి20 ప్రపంచ కప్ ను గెలుచుకోవడం, యువ ఆటగాడు గుకేష్ ప్రపంచ చెస్ విజేతగా నిలవడం క్రీడారంగంలో మనం సాధించిన విజయాలు. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు రికార్డు స్థాయిలో పతకాలను కొల్లగొట్టారు. మున్నెన్నడూ లేనంతగా ప్రకృతి విలయాలు దేశాన్ని కుదిపివేశాయి. దేశవ్యాప్తంగా మండుటెండలు, తుపానులతోపాటు భారీవర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియ లు వేలాది ప్రాణాలను హరించాయి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గతేడాది తొలి తొమ్మిది నెలల్లో 3,238 మంది కన్నుమూశారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అంచనా వే సింది. వయనాడ్‌లో విరిగిపడిన కొండ చరియల ఉదంతాన్ని, ఈశాన్య రాష్ట్రాల్లో రేమాల్ తుపాను సృష్టించిన విలయాన్ని మహావిషాదాలుగా పేర్కొనవచ్చు.

కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురికావడం ప్రపంచదేశాలలో భారత ప్రతిష్ఠను దిగజార్చింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్ళీ తలెత్తడం, మణిపూర్లో ఏడాదిన్నర క్రితం జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలకు, పంజాబ్, హర్యానాల్లో కనీస మద్దతు ధర కోసం రైతులు చేస్తున్న అవిశ్రాంత పోరాటానికి ఓ పరిష్కారాన్ని కనుగొనలేకపోవడం అపజయాలుగానే పేర్కొనాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బ ణం, నిరుద్యోగిత వంటి సమస్యలకు సైతం పరిష్కారమార్గం కనిపించలేదు. దీనికితోడు డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి మహానేతను, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ను, తబలా వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్‌ను కోల్పోవడం భారత్‌కు తీరనినష్టం.

ప్రపంచ పరిణామాలను చూస్తే, మధ్యప్రాచ్యంలోనూ, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాలకు ఓ పరిష్కారాన్ని చూపించలేకపోవడం ప్రపంచదేశాల చేతకానితనమని చెప్పాలి. వాతావర ణ కాలుష్యానికి, పెచ్చుమీరుతున్న ప్లాస్టిక్ వినియోగానికి ముకుతాడు వేయడంలోనూ ముందడుగు పడలేదు. కొత్త సంవత్సరంతో ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఆశలు చివుళ్లు తొడగాలి. లక్ష్యసాధన దిశగా రెట్టించిన ఉత్సాహంతో కృషి జరగాలి. గత ఏడాది మనకు దక్కని విజయాలను ఈ సంవత్సరంలోనైనా సాధించేందుకు ప్రతినబూనాలి. ప్రపంచదేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేందుకు నాంది పలకాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News