Wednesday, January 22, 2025

ప్రజల భాగస్వామ్యంతో విజయ సంకల్ప యాత్రకు ఆదరణ

- Advertisement -
- Advertisement -

అభివృద్ది చెందిన భారతానికి మన మోడీ గ్యారెంటీ పోస్టర్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి సొంతంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే కూటమికి 400 సీట్లను చేరుకోవడమే లక్ష్యమని కేంద్రమంత్రి, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు ఊహించని స్పందన వస్తోందని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ -మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ ఆవిష్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేడు దేశం సాధిస్తున్న ప్రగతికి, మారుమూల ప్రాంతాల వరకు సంక్షేమ పథకాలు చేరుతున్న తీరుతో కాషాయం జెండాను చూడగానే ప్రజలే స్వచ్ఛందంగా ఇదే మన మోదీ గ్యారంటీ అని చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొదటి విడుత ఐదు విభాగాలుగా విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోందని వెల్లడించారు. తమ పార్టీ సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో వచ్చే ఐదేళ్లకు సంబంధించి అజెండా రూపొందించామని వెల్లడించారు. మన తరువాత స్వాతంత్య్రం వచ్చిన దేశాలు అభివృద్ధి చెందాయని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన దేశంలో మౌలిక వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

2047 నాటికి భారత్ ప్రపంచంలో విశ్వగురు స్థానానికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు అధికారంలో ఎవరు ఉంటారనేది ముఖ్యం కాదని, ఆ సమయానికి కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని తెలిపారు. భారతదేశం 75 సంవత్సరాలు అయినా ఇంకా మౌలిక వసతులు లేవని, పేదరికం ఉందని విద్యా వైద్య సౌకర్యాలు లేవన్నారు. ఈ విధంగా వదిలేస్తే ఇంకా వంద సంవత్సరాలు అయిన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగమని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రతిజ్ఞ తీసుకొని 2047లో స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ల పండుగ జరుపుకుంటామో ఆ వచ్చే ఏడాదికి దేశం ఒక డెవలప్‌మెంట్ దేశంగా ఎదిగే విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. వచ్చే ఐదేళ్లు కూడా మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, అందుకు సంబంధించిన ఎజెండాను కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

దేశంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలని అలాగే పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ ఉండాలని సూచించారు. 2047 నాటికి భారతీయులు విద్య కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదన్నారు. గ్యాన్ అనే నాలుగు అక్షరాలు తమ పార్టీ అజెండా అని జీ అంటే గరీబ్ కల్యాణ్, వై అంటే యూత్, ఏ అంటే అగ్రికల్చర్, ఎన్ అంటే నారీ శక్తి అని అర్థమని వివరించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఫిర్ ఏక్ బార్-మోదీ సర్కార్ నినాదంతో ముందుకెళ్తామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News