మరిపెడ: వెల్‌డన్ యశ్వంత్.. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ అన్నారు. ఇటివల మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపు పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ యువ పర్వతారోహుడు భూక్య యశ్వంత్ నాయక్‌ను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ బుధవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో అభినందించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని భూక్యతండాకు చెందిన భూక్య రాంమూర్తినాయక్, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు భూక్య యశ్వంత్ నాయక్ పలు ఇబ్బందులు చవిచూస్తూ వాటిని తట్టుకొని ఎంతో శ్రమకోర్చి గత ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని ఎత్తయిన ఖార్డుంగ్ లా, ఆగస్టులో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాలను అధిరోహించాడు.
చిన్న వయస్సులో రష్యాలోని ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ అగ్ని పర్వతాన్ని, హిమాచల్ ప్రదేశ్‌లోని యూనామ్ పర్వతాలను ఇటీవల అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి సత్తా చాటాడు. ఈ సందర్భంగా కమిషనర్ చౌహాన్ మాట్లాడుతూ పర్వతారోహన అనేది పర్వతారోహుల కళ అని, కృషి పట్టుదల, నిరంతర శ్రమతో చిన్న వయస్సులో ఈ విజయాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. పర్వతారోహణ ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని అని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కృషి చేసి మరిన్ని ప్రఖ్యాత పర్వతాలను దిగ్విజయంగా అధిరోహించి రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలన్నారు. అనంతరం రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్‌కు భూక్య యశ్వంత్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.