Monday, January 20, 2025

ఇంటి వద్దకే సంక్షేమం.. ప్రతి ముఖంలో ఆనందం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని, మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 19వ వార్డుకు చెందిన పద్మావతి ఆనారోగ్యం బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోగా ఆమెకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.25 లక్షలు మంజూరయ్యాయి.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ బుధవారం పద్మావతి ఇంటికి నేరుగా వెళ్లి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆమెకు అందజేశారు. ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి సిఎంఆర్‌ఎఫ్ చెక్కును అందించడం పట్ల పద్మావతి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, అలాగే అన్ని వర్గాల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు.

ప్రభుత్వం అందించే ఏ పథకమైనా నేరుగా లబ్దిదారులకే అందిస్తున్నామన్నారు. దీని ద్వారా మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండకుండా పారదర్శకత ఉంటుందన్నారు. అందరికీ ప్రభుత్వ పరంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌళిక వసతులు కల్పించి అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలందేలా వైద్యులను, సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలందించడంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు తీసుకుని ఆర్థికంగా చితికిపోయిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నామని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ మొత్తంలో ఆంధ్రా ప్రాంతం వారికే అందేవని, తెలంగాణకు అంతంత మాత్రంగా అందించే వారన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో జగిత్యాల నియోజకవర్గంలోనే రూ.10 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.

జగిత్యాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడం అదృష్టమని, మెడికల్ కళాశాలతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుతో హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే పొందవచ్చన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు రేడియాలజీ ల్యాబ్ ఏర్పాటైందని, జనరల్ ఆస్పత్రిలో సిటి స్కానింగ్ ఏర్పాటు చేశామన్నారు ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు ముస్కు నారాయణరెడ్డి, క్యాదాసు నవీన్, నాయకులు రంగు మహేశ్, రామకృష్ణారెడ్డి, మహేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News