హెలెన్ కెల్లర్ జయంతోత్సవంలో చైర్మన్ వాసుదేవ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ కె. వాసుదేవ రెడ్డి అన్నారు. డెవలప్‌మెంట్ సొసైటి ఫర్ డెఫ్(డిఎస్‌డి) ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో బధిర వికలాంగుల స్పూర్తి ప్రదాత, ఆస్కార్ అవార్డు గ్రహిత హెలెన్ కెల్లర్ 143 జయంతోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డా. వాసుదేవ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. హెలెన్ కెల్లర్ తన ఏడాది వయస్సులోనే చెవులు వినపడక పోవడం, మాటలు రాకపోవడం, కళ్ళు కనబడక పోవడం వంటి లోపాలు ఉన్నా స్వశక్తితో రాణించి శక్తివంతురాలుగా గుర్తింపు పొందారని వాసుదేవరెడ్డి అన్నారు.
19వ దశాబ్దంలో ఇద్దరు శక్తివంతులు జన్మిస్తే అందులో నిపోలియన్, హెలెన్ కెల్లర్ అని చరిత్ర చెబుతోందన్నారు. శోధించి సాధించాలి అనే సంకల్పంతో హెలెన్ కెల్లర్ బ్రెయిలీ లిపిలో తన ఆత్మకథను రూపొందించుకోవడం, గొప్ప గొప్ప రచనలు రచించి అందరికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు రూ.3016 పెన్షన్ అందిస్తోందని తెలిపారు. వికలాంగుల కోసం అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నారని, సబ్సిడీ రుణాలు ఇస్తూ వికాలంగుల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం, వికలాంగుల కార్పొరేషన్ కృషి చేస్తోందన్నారు.
బధిరుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల లేనందున దానిని ఏర్పాటు చేయాలనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే బదిరుల డిగ్రీ కళాశాల మంజూరు కానుందన్నారు. బ్రెయిలి లిపిలో పుస్తకాలు ముద్రించి ఉచితంగా విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. ఎక్కడ ఆత్మస్థైర్యం కోల్పోకుండా జబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అంధురాలైన ప్రాంజెస్ పటేల్, దివ్యాంగుల సాధికార సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా విధులు నిర్వహిస్తున్న హీరాసింగ్, పుట్టుకతో రెండు చేతులు కోల్పోయిన జెస్సికా లాంటి దివ్యాంగులను ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించాలని దివ్యాంగులను కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రసాద్ భారతి, వెంకటేశ్వరరావు, ఎన్‌ఫి ఆర్‌డి నుండి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.