Thursday, December 12, 2024

నేతన్నల సంక్షేమానికి మెరుగైన పథకాలు:మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

చేనేత రంగాన్ని రక్షించేందుకు, నేతన్నల సంక్షేమానికి, అభివృద్ధికి మెరుగైన పథకాలు తెస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం హైదరాబాద్ అమీర్‌పేట కమ్మ సంఘ భవనంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా ఈ నెల 6 నుంచి 9 వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ఎక్స్‌పో ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎక్స్‌పోలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర, హస్తకళల స్టాళ్లను మంత్రి పరిశీలించారు. నవంబర్ 2023 టెస్కో కు రావాల్సిన బకాయిలు రూ. 428 కోట్ల 14 లక్షల 47వేల 226 ల చెక్కు కార్మికుల సబ్సిడీ బకాయిలు రూ. 37 కోట్ల 49 లక్షల 68 వేల, నూలు డిపో కార్పస్ ఫండ్ రూ. 50 కోట్ల రూపాయల చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేతన్నల అభివృద్ధి, సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతన్నల బకాయిలు, సబ్సిడీ అందించామని అన్నారు. రైతన్నల మాదిరిగా నేతన్నలకు కూడా నేతన్న బీమా అందిస్తున్నామన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరున పద్మశాలీల కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఉత్తర్ నెంబర్ 1 ద్వారా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ సంస్థలకు కావలసిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనాలని ప్రభుత్వం ఆదేశించిందని దీని ద్వారా రాష్ట్రంలో చేనేత పవర్ లూమ్ పరిశ్రమల అభివృద్ధితో పాటు నేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించబడుతుందని అన్నారు. నూలు డిపోను నడపడానికి రూ.50 కోట్లు కార్పస్ ఫండ్ క్రింద మంజూరు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు మెరుగైన పథకాలు తెస్తుందన్నారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, చింతకింది మల్లేశం సంత్ కబీర్ దాస్ అవార్డు గ్రహీత, సిల్వర్ ఫిలిగ్రి కళాకారులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, హడ్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, జగన్నాధం మురళి, చేనేత , జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ వెంకటేశం,జాయింట్ డైరెక్టర్లు ఎన్ వెంకటేశ్వర్లు, ఇందుమతి దేవి, ఓ ఎస్ డి బాషా, జి ఎమ్ అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News