ఆరోగ్యలక్ష్మీ పథకంతో 36లక్షల మంది మహిళలకు లబ్ది
ఆర్థిక తోడ్పాటుకు స్వయం సహాయక బృందాలు
సఖి కేంద్రాల ద్వారా మహిళలకు బహుముఖ సేవలు
మహిళా రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలు ఏర్పాటు
హైదరాబాద్: అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వరాష్ట్రం ఏర్పాటు కలను సాకారం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, తొమ్మిదేళ్ల కాలంలో జనాభాలో సగభాగంగా ఉన్న ఆడబిడ్డలకు అండగా నిలుస్తోంది. దేశం యావత్తూ అబ్బురపరిచే పథకాలు అమలు చేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నో కష్టాలు, బలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జాతీయస్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తోంది. మాతా శిశు సంరక్షణ కోసం కార్యక్రమాల అమలులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలకు దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు అందుతోంది. గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ’ఆరోగ్య లక్ష్మీ’ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి గర్భిణీలకు, బాలింతలకు అంగన్ వాడీ కేంద్రాలలో వేడివేడిగా వండిన భోజనాన్ని అందిస్తోంది. ఈ పథకంతో 36,26,603 మంది మహిళలు లబ్ది పొందారు.
ఆరోగ్య లక్ష్మీ యాప్ ను రూపొందించి గర్భిణీల, బాలింతల హాజరును వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. భోజనంలో పప్పు, ఆకు కూరలు, సాంబార్, కూరగాయలు, ఉడకపెట్టిన గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది. భోజనంతో పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రను కూడా ఇస్తారు. పోషకాహారంపై అవగాహన, ఆవశ్యకత తెలుపడంతో పాటు గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని విధిగా తీసుకునేలా చర్యలు తీసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం‘ పేరుతో పోషకాహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. గోధుమ, శనగపప్పు, మిల్క్ పౌడర్, నూనె పంచదార తో కూడిన ఆహారాన్ని అందిస్తారు. రోజుకు 3 నుంచి 5 సార్లు 100 గ్రాముల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. బాలామృతం ప్యాకెట్ తో పాటు నెలకు 16 గుడ్లను 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు అందించడం జరుగుతుంది. చిన్నారులలో ఉండే పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు బాలామృతం చాలా ఉపయోగపడుతుంది.
చిన్నారులలో తీవ్ర పౌష్టికాహార లోపాలను అరికట్టడానికి బాలామృతం ప్లస్‘ అనే పథకాన్ని కూడా ప్రవేశ పెట్టింది. ఆసిఫాబాద్- కొమరంభీం, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి అనంతరం అన్నీ జిల్లాలకు విస్తరించారు. పాఠశాల బయట ఉన్న కౌమార దశ, (11-14 వయస్సు మధ్యలో ) ఉన్న ఆడ పిల్లలకు, ఇతర అవసరాలు గల ఉన్న ఆడపిల్లలకు పోషకాహార కిట్లను ప్రభుత్వం అందచేస్తుంది. ఆ కిట్ లో గోధుమలు, నెయ్యి, కర్జూరాలు, ప్రోటీన్ బిస్కెట్స్, ఐరన్, జింక్ సిరప్, మల్టీ విటమిన్స్ మాత్రలు ఉంటాయి.
గిరిజన సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఇక్రిశాట్ శాస్త్రీయ సహకారంతో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. తక్కువ బరువు, పెరుగుదలలో లోపం, రక్త హీనత, కలిగిన గిరిజన పిల్లలు, కౌమార దశ బాలికలు, గర్భిణీలు, బాలింతలకు ఈ గిరిపోషణ కార్యక్రమాన్నివర్తింప చేశారు. ఉట్నూర్, భద్రాచలం, మన్నూరులలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని ప్రాంతాలలో శిశువులు, గర్భిణీలు, కౌమార దశ ఉన్న ఆడ పిల్లలకు హైడ్రేన్స్ పోషకాహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజన గూడాలల్లో 3వేల గర్భిణీలకు పోషకాలతో కూడిన మహాలడ్డు ను 8 నెలలపాటు ఇవ్వడం జరిగింది. ఖాళీ స్థలాలు కలిగిన అంగన్ వాడి కేంద్రాలలలో న్యూట్రీ గార్డెన్ పేరిట ఉద్యాన వనాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోడల్ న్యూట్రీ గార్డెన్స్ లో సంప్రదాయ పద్ధతిలో సేద్యం చేస్తున్నారు. న్యూట్రీ గార్డెన్ లో కూరగాయలు, ఆకుకూరలను పండించి, కమిషనర్ కార్యాలయంలో నెలకొని ఉన్న చిల్డ్రన్ హోమ్ శిశు విహార్ చిన్నారులకు అందించడం జరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్ వాడీ టీచరు నెలకు రూ.13,650, ఆంగన్ వాడీ హెల్పర్ కు రూ. 7,800లు గౌరవ వేతనంగా ఇస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసింది. అంగన్ వాడీ టీచర్లకు నెలనెలా పుస్తకాలను అందించడం జరుగుతుంది.
తంగేడు పూల పేరిట నాలుగు పుస్తకాలు, పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలను ఎల్.కేజీ, యూకేజీలో చేరిన విద్యార్థులకు విధిగా ప్రభుత్వం అందిస్తోంది. పూర్వ ప్రాథమిక విద్యా పాఠ్యప్రణాళికలో వీడియోలు, ఆడియో కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి వీలుగా బాల రక్షక్ వాహనాలను ఏర్పాటు చేసి, రెస్క్యూ ఆపరేషన్స్ లో వాడటం జరుగుతుంది. దేశంలోనే మొట్ట మొదటి సారిగా వివిధ కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంధ సంస్ధల సహకారంతో అందిన నిధులతో వాహనాలను కొనుగోలు చేసి, రెస్క్యూ ఆపరేషన్లలో వినియోగించడం జరుగుతోంది. రక్షక భవనాలను ఏర్పాటు చేసి ఒకే గొడుగు కింద బాలల రక్షణ చర్యలు చేపడుతున్నారు. గృహహింస, వేధింపులు, దాడులు, ప్రమాదాలకు గురైన మహిళకు తక్షణ వైద్యం, న్యాయం, ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో వన్ స్టాప్ సెంటర్ ‘ సఖి‘ని ఏర్పాటు చేశారు. ఈసఖి కేంద్రాలలో మహిళలకు బహుముఖ సేవలు అందించడం జరుగుతుంది. సఖి కేంద్రంలో మహిళకు 5 రోజుల పాటు అత్యవసర ఆశ్రయం కూడా కల్పిస్తారు.
ప్రత్యేకంగా మహిళా ప్రయాణీకుల రక్షణ కోసం ప్రభుత్వం 16 షీ టాక్సీలను ప్రవేశపెట్టింది. 16 మంది మహిళా డ్రైవర్స్ ఈ టాక్సీలను నడుపుతూ మహిళా ప్రయాణీకులకు రక్షణగా ఉంటున్నారు. షీ టాక్సీలను 35 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోంది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తన వాటాగా 35 శాతం సబ్సిడీ, 10 శాతం మార్జిన్ మనీ తో మహిళా క్యాబ్ డ్రైవర్స్ ను క్యాబ్ లు కొనుగోలు చేసేందుకు ప్రోత్సహిస్తుంది. మహిళలు సర్వతోముఖాభివృద్దిగా చెందినపుడే సమాజం అభివృద్ది చెందుతుంది. అనే నమ్మకంతో స్వయం సహాయక సంఘ మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు ఇచ్చే ద్రవ్య సహాయం మూడింతలు పెరిగింది. స్వయం సహాయక బృందాల సభ్యులు, బృందాల గ్రామ స్థాయి సంస్థల ఆర్ధిక లావాదేవీలను నమోదు చేసేందుకు మొబైల్ అకౌంటింగ్ యాప్ ను కూడా రూపొందించారు.