Tuesday, January 7, 2025

బిజెపి ఢిల్లీలో అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగవు

- Advertisement -
- Advertisement -

అవినీతిని పార్టీ నిర్మూలిస్తుంది
కేంద్రంపై పోరుతో ఢిల్లీ ఆప్ ప్రభుత్వం ఒక దశాబ్దాన్ని వ్యర్థం చేసింది
భావి నగరంగా దేశ రాజధానిని మార్చే అవకాశం బిజెపికి ఇవ్వండి
ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కేంద్రంపై పోరుతో ఒక దశాబ్దాన్ని వ్యర్థం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆరోపించారు. దేశ రాజధానిని భవిష్యత్ నగరంగా మార్చే అవకాశాన్ని బిజెపికి ఇవ్వాలని ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చినట్లయితే సార్వత్రిక సంక్షేమ పథకం దేనినీ ఆపివేయదని కూడా ప్రధాని హామీ ఇచ్చారు. అయితే, ఆ పథకాల అమలులో అవినీతిని పార్టీ ప్రభుత్వం నిర్మూలిస్తుందని మోడీ స్పష్టం చేశారు. రోహిణి ప్రాంతంలో ఒక ర్యాలీలో ప్రసంగించిన మోడీ ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీకి వాటిల్లిన ‘ఆపద’గా అభివర్ణించారు.

బిజెపి మార్పును తీసుకువస్తుందని ఆయన ప్రకటించారు. ‘ఢిల్లీలో ఈ ఆపద నుంచి విముక్తి కలిగినప్పుడే డబుల్ ఇంజన్ అభివృద్ధి చోటు చేసుకుంటుంది’ అని మోడీ అన్నారు. కేంద్రం ఢిల్లీలో రహదారులను అభివృద్ధి చేస్తోందని, మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరిస్తోందని, నమో భారత్ ప్రాంతీయ సత్వర రవాణా వ్యవస్థను ప్రారంభిస్తున్నదని, భారీ ఆసుపత్రులను నడుపుతోందని ప్రధాని తెలియజేశారు. ‘అయితే. ఏదైనా మెట్రో స్టేషన్‌లో నుంచి మీరు బయటకు అడుగు పెట్టిన మరుక్షణం గుంతల రోడ్లను, పొంగి ప్రవహిస్తున్న మురుగు నీటిని చూస్తారు. కొన్ని ప్రాంతాలు ఎటువంటివి అంటే తుదకు క్యాబ్, ఆటో డ్రైవర్లు కూడా సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌ల కారణంగా తమ వాహనాలు నడపడానికి నిరాకరిస్తుంటారు’ అని ఆయన చెప్పారు. ‘గడచిన పది సంవత్సరాల్లో ఢిల్లీ ఒక ఆపదకు తక్కువ కాని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసింది.

ఢిల్లీ వాసులు దీనిని గ్రహించారు. ‘ఆపదను సహించబోం, మార్పు తీసుకువస్తాం’ అనే నినాదం మాత్రమే ఢిల్లీలో ప్రతిధ్వనిస్తోంది’ అని మోడీ చెప్పారు. ఢిల్లీ ప్రజలు కొవిడ్ 19తో సతమతం అవుతున్నప్పుడు, ఆక్సిజన్, మందుల కోసం తంటాలు పడుతున్నప్పుడు ‘ఆపద జనం’ దృష్టి అంతా తమ ‘అద్దాల మేడ’ నిర్మాణంపైనే ఉందని ప్రధాని విమర్శించారు. ‘వారు అద్దాల మేడ కోసం భారీ బడ్జెట్ పెట్టారు. ఇది వారి నిజం& వారికి ఢిల్లీ ప్రజల గురించి పట్టదు. అందుకే మొత్తం ఢిల్లీ ఇప్పుడు ‘మేము ఆపదను సహించబోం, మార్పు తీసుకువస్తాం’ అని చెబుతోంది’ అని మోడీ పేర్కొన్నారు. తాము అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఢిల్లీలోని బిజెపి ప్రభుత్వం కొనసాగించబోదని ఆప్ జనంలో భయాన్ని సృష్టిస్తున్నదని కూడా మోడీ ఆరోపించారు.

ఆప్ ప్రభుత్వం నిలిపివేసిన కేంద్ర పథకాలను రెట్టించిన శక్తితో బిజెపి కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ‘మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, 25 సంవత్సరాలు గడిచాయి. రెండు మూడు తరాల వారు తమ యౌవనంలోకి ప్రవేశించారు. తదుపరి 25 సంవత్సరాలు ఢిల్లీకి ఎంతో ముఖ్యమైనవి. తదుపరి 25 సంవత్సరాలు భారత్ వారి కళ్ల ముందే అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడం చూస్తారు. ఈ ప్రస్థానంలో మన అందరికీ పాత్ర ఉంటుంది’ అని మోడీ అన్నారు. దేశ రాజధాని ఈ మహత్తర ప్రస్థానంలో భాగం కావాలని ఆయన అన్నారు. ‘ఢిల్లీలో ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఆశీర్వదించారు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆశీర్వదించనున్నారు. ఢిల్లీ హృదయాన్ని గెలవడానికి, ఆపద నుంచి విముక్తం చేయడానికి ఇదిసువర్ణావకాశం’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News