Thursday, January 23, 2025

సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి

వికారాబాద్ : ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక గౌలికర్ ఫంక్షన్ హాల్‌లో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్షేమ సంబరాలను వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఎంపిపి చంద్రకళ, ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి తెలంగాణ గీతాన్ని ఆలపించి సంబరాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చేవెళ్ల ఎంపీ మాట్లాడుతూ తెలంగాణలో పెద్ద మొత్తంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతూనే కుల వృత్తులపై ఆధారపడి బతికిడిస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా బలపడేందుకు లక్ష రూపాయల సహాయాన్ని అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామీణ పరంగా ఆర్థికంగా బాగుంటేనే రైతు సహోదరులు బాగుంటారని ఎంపీ అన్నారు. స్వాతంత్ర సిద్ధించి 70 సంవత్సరాలు పూర్తయినప్పటికీ చిన్న, మధ్య తరగతుల ప్రజలు అభివృద్ధి చెందడం లేదని భావించి భారతదేశానికి అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చడం కోసం ఆయనను పునర్జీవం చేసుకొని వారి ఆశయాలు నెరవేర్చేందుకు లక్ష్యం దిశగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయులని ఎంపీ కొనియాడారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు వేదికలను ఏర్పాటుచేసి వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహించి పంటల దిగుబడుల కొరకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుల నిమిత్తం 20 లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తుందని దీన్ని సద్విని చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవుతే తమ కుటుంబం బాగుపడుతుందని తెలుపుతూ… పిల్లల అభివృద్ధిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. ఎదగాలని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల కళకళలాడే ఆశ్రమాలు వెలవెలబోతున్నాయని అన్నారు. అమ్మాయిలు దేనిలో తక్కువ కాదని వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు.

ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న సహాయంతో రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గిపోయాయని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి మనిషికి పుట్టుకతో మొదలు పెడితే చివరి మజిలీ వరకు గౌరవంగా ఉండాలని ఉద్దేశంతో వైకుంఠధామలను చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అవసరం ఉన్నవారికి చేయూతనిస్తూ సహకారం అందిస్తుందన్నారు. కొన్ని కుటుంబాలు ఆగం కాకుండా చేయుతనందించేందుకు ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలు, బీడీ, కల్లు గీత కార్మికులు, వికలాంగులకు పెన్షన్లను అందజేసి ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

పెన్షన్ల ద్వారా వృద్ధాప్య, వికలాంగులకు సొంత ఖర్చులతో పాటు ఆరోగ్య అవసరాలకు ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను కేటాయిస్తుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా వంటి పథకాలతో ప్రజల్లో ప్రభుత్వం మనోధైర్యాన్ని కల్పిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఆడపిల్లల చదువుల కోసం గురుకుల పాఠశాలను స్థాపించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా విదేశాల్లో ప్రభుత్వం ఖర్చుతో విద్యను అభ్యసించుటకై ప్రభుత్వం 20 లక్షల రూపాయల సహాయం చేస్తుందని అన్నారు. జన్మనిచ్చిన ఆడవారికి మరో జన్మ అని తెలుపుతూ ప్రభుత్వం వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొని వస్తూనే కెసిఆర్ కిట్ ద్వారా మగ పిల్లలకు 12 వేలు, ఆడపిల్లలకు 13 వేలు అందించడం జరుగుతుంది కలెక్టర్ గుర్తు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఆర్థికంగా ఎదగలేరని , వ్యాపారం ద్వారా ఎదగడానికి అవకాశం ఉంటుందని గుర్తు చేస్తూ దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన వారు ఆర్థికంగా ఎదిగి ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన సహాయం వల్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి స్పందనను వెల్లడించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, వివిధ కుల వృత్తుల వారికి ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ , షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాబు మోజెస్ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుభాషిని, ఎంపీడీవో సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News