Wednesday, January 22, 2025

గర్భస్థ శిశువు నుంచి చనిపోయే వరకు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్: గర్భస్థ శిశువు నుంచి చనిపోయే వరకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ చదువుతోపాటు, ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక సాయిబాలాజీ గార్డెన్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. అంతకుముందు అతిథులను బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించగా, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మాజీ మెదక్ నియోకవర్గ ప్రగతి నివేదిక చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు గుక్కెడు మంచినీళ్ల కోసం మహిళలు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం వెళ్లేవారని, కానీ నేడు ఇంటింటికి కుళాయి నీలందిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని సిఎం నిలబెట్టారన్నారు. ఒంటరి మహిళా, వితంతువులు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు అదిస్తుండటంతో పాటు భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించుటకు బుధవారం నుంచి కెసిఆర్ న్యూట్రిషన్ కిట్‌లు అందించనున్నామని అన్నారు. అదేవిధంగా బాలింతలు, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు,బాలామృతం అందిస్తున్నామని, ప్రభుత్వాసుపత్రులలో కాన్పులు చేసుకున్న వారికి నగదుతో పాటు కెసిఆర్ కిట్ అందించనున్నామని అన్నారు.

గురుకుల పాఠశాలల ద్వారా అందిస్తున్న విద్యతో పాటు బాలికలు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని అన్నారు. పేదింటి ఆడపిల్లకు మేనమామలా పెళ్లికి 1లక్ష 116 ఇస్తూ సామాజిక భద్రత కల్పిస్తుండటం ద్వారా బాల్య వివాహాలు నివారించగలిగామన్నారు. పోలీసు శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిందని మహిళల పేర రెండు పడకల ఇల్లు, ఇళ్ల పట్టాలు అందిస్తుందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను టీచర్లుగా గుర్తిస్తూ గౌరవ వేతనం పెంచిందని, అంగన్‌వాడీ హెల్పర్లకు కూడా రెమ్యునరేషన్ పెంచిందని అన్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లపై సిఎంకి సానుభూతి ఉన్నదని, తప్పక వారికి న్యాయం చేస్తారన్నారు.

ఆడపిల్లకు రక్షణ కవచంగా షీటీమ్స్ ఏర్పాటు చేశారని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించుటకు వి-హాబ్ చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో మహిళలు చురుకుగా పాల్గొని బతుకమ్మ, బోనాలు, రోడ్డుపై వంటావార్పు ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తూ, ధర్నాలతో పాల్గొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సంసారం సాఫీగా నడవాలంటే భార్యభర్తలు బండికి రెండు చక్రాల లాంటి వారని ఇరువురు పరస్పర సహకారంతో పయనించాలని అన్నారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు ప్రభుత్వం విస్తృత అవకాశాలు కల్పించడం ద్వారా జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు.

మహిళలలో వృత్తి నైపుణ్యతను పెంచి ఆర్థికంగా బలోపేతం కావడానికి సెర్ప్ తదితర శాఖల ద్వారా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తోటివారినికూడా ప్రోత్సహించి వారి ఎదుగుదలకు సహకరించాలని సూచించారు. అంతకుముందు లంబాడాలతో ఎమ్మెల్యే చిందులు వేశారు. విద్యార్థినిలు చక్కటి సాంస్కృతిక ప్రదర్శనలు అహుతులను అలరించాయి. వివిధ శాఖలలో ఉత్తమ మహిళా ఉద్యోగులను జ్ఞాపిక ప్రశంసపత్రంతో అతిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, ఎంపిపి యమున జయరాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, డిఎస్‌డిఓ విజయలక్ష్మి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇందిరా, మత్సశాఖ ఏడీ రజిని, డిసిఓ కరుణ, అదనపు పిడి బీమయ్య, మైనార్టీ అధికారి జెంలా నాయక్, బీసీ అభివృద్ధి అధికారి శంకర్, రామాయంపేట మున్సిపల్ కమీషనర్ ఉమాదేవి, మహిళా కౌన్సిలర్లు, కౌన్సిలర్లు, సిడిపిఓలు, సూపర్‌వైజర్లు , అంగన్‌వాడీ కార్యకర్తలు, వివిధశాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News