హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కాలధర్మం చెందారు. కాసేపటి క్రితమే ఆయన కన్నుమూశారు. ఆయన అసలు పేరు తోటకూర సోమరాజు. రాజ్-కోటి ద్వయం పేరిట అనేక సినిమాలకు సంగీత దర్శకత్వాన్ని అందించారు. రాజ్-కోటిల వద్ద ప్రముఖ దర్శకుడు ఏఆర్. రహ్మాన్ కూడా కీబోర్డు ప్రోగ్రామర్‌గా ఎనిమిదేళ్లు పనిచేశారు. రహ్మాన్, రాజ్-కోటిలను తన సోదరులని చెప్పుకునేవారు. రాజ్ మరణం సంగీత ప్రియులకు తీరని లోటుని మిగిల్చింది.
రాజ్ ఆర్కెస్ట్రాకు నోట్స్ ఇవ్వడం, మ్యూజిక్ కండక్ట్ చేయడం చేస్తుండేవారని కోటి అన్నారు. కాగా కోటి కూడా రాజ్‌కు సరిసమానులే. అన్ని పాటలకు వీరిద్దరూ కలిసి పనిచేశారు. ప్రతి పాట క్రెడిట్ ఇద్దరికీ దక్కేది.
అతి తక్కువ వయస్సులోనే వారిద్దరూ అనేక పాటలకు మ్యూజిక్ కంపోజ్‌ను అందించారు. దాదాపు 180 సినిమాలకు పాటలందించారు. వారు రూపొందించిన 3000 పాటల్లో 2500 పాటలు ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర పాడారు. నటుడు నాగార్జున నటించిన ‘హలో బ్రదర్’ సినిమాకు 1994లో ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’ గా నంది అవార్డు అందుకున్నారు. తామిద్దరం తిరిగి కలిసి పనిచేయబోతున్నామని ఈ మధ్యే వారిద్దరూ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల వారి ప్లాన్ సాకారం పొందలేదు. వారిద్దరూ విడిపోయాక కోటి 300 సినిమాలకు నేపథ్య సంగీతం సమకూర్చారు.
రాజ్ మృతితో టాలీవుడ్ సంతాపం ప్రకటించింది, విషాదంలో మునిగిపోయింది. ఇంకా వివరాలు అందాల్సి ఉన్నాయి.