Thursday, September 19, 2024

మసకబారిన మమత ప్రతిష్ఠ

- Advertisement -
- Advertisement -

బెంగాల్ టైగర్‌గా, ఫైర్‌బ్రాండ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన 14 ఏళ్ల పాలనా అనుభవంలో ఇంత వ్యతిరేకత ఎన్నడూ ఎదుర్కోలేదు. కోల్‌కతాలోని ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ట్రయినీ వైద్య విద్యార్థిని అత్యంత దారుణంగా హత్యాచారానికి గురికావడం, ఈ కేసును పరిష్కరించడంలో అడుగడుగునా కనిపించిన లోపాలు ఆమె ప్రతిష్ఠను మసకబారినట్టు చేస్తున్నాయి. ఈ సంఘటన విషయంలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ గాని, పోలీసులు గాని కచ్చితంగా అనుసరించాల్సిన నిబంధనలేవీ పాటించలేదు. జూనియర్ వైద్యురాలి శరీరంపై తీవ్రగాయాలు కనిపిస్తున్నా, దారుణం గా హత్యాచారానికి గురైందని ప్రాథమికంగా తెలుస్తున్నా అవేవీ పరిశీలించకుండా, వాస్తవాలు కప్పిపుచ్చి ఆత్మహత్య వల్లనే చనిపోయిందని మొదట ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించడం, అసహజ మరణంగా నమోదు చేయడం అనుమానాలకు దారి తీశాయి.

ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడంలో కొన్నిగంటల పాటు ఆలస్యం చేయడం, అలాగే తమ కుమార్తె భౌతిక కాయాన్ని చూడడానికి తల్లిదండ్రులను కొన్ని గంటల పాటు అడ్డుకోవడం వివాదాస్పదమైంది.ఈ కేసును చేపట్టడంలో ఆస్పత్రి వర్గాలు, పోలీస్‌లు సమర్ధంగా నిర్వహించలేకపోయారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగానే ఈ సంఘటనపై మహిళల్లో తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక మహిళా ముఖ్యమంత్రి పాలిస్తున్న రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రీ క్లెయిమ్ ది నైట్ (‘రీ క్లెయిమ్ ది నైట్ అంటే అర్ధరాత్రి స్వాతంత్య్రం మహిళలకు కల్పించాలి’) అన్న నినాదంతో ఆందోళన వ్యాపించింది. అయితే బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని తొలగించడానికి ఎలా ఆందోళనలు సాగాయో అదే తరహాలో తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వామపక్షాలు, ఇతర విపక్షాలు (రామ్‌బామ్ వర్గాలు) ఆందోళనలను రెచ్చగొడుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఆర్‌జి కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిని ఆగస్టు 15 తెల్లవారు జామున అల్లరి మూకలు ధ్వంసం చేయడానికి బరి తెగించినప్పుడు అక్కడే రక్షణగా ఉన్న పోలీసులు అడ్డుకోలేదు సరికదా కొందరు తమను తాము రక్షించుకోడానికి ఆస్పత్రిలోకి పరుగులు తీయడం అత్యంత వివాదాస్పదమైంది. దాదాపు ఏడు వేల మంది అల్లరి మూకలో తృణమూల్ పార్టీ మద్దతుదారులు ఉండడం దీని వెనుక ముఖ్యమంత్రి ప్రోత్సాహం ఉందన్న అపవాదు వచ్చింది. సాక్షాధారాలను తుడిచిపెట్టడానికే ఈ విధ్వంసం జరిగిందన్న ఆరోపణలు తలెత్తాయి. సుప్రీం ధర్మాసనం కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. పైగా విధ్వంసానికి పాల్పడినవారిలో చాలా మంది రాష్ట్రానికి చెందిన వారు కాదు. కొన్ని వారాల క్రితం చోప్రాలో దంపతులను స్థానిక తృణమూల్ నేత బహిరంగంగా నడిరోడ్డు పైనే చితక బాదుతుంటే బాధితురాలు బాధతో మెలికలు తిరగడం అక్కడి జనం ప్రత్యక్షంగా చూశారు. అలాంటి అల్లరి మూకలే ఎన్నికల సమయంలో హింసాకాండకు పాల్పడ్డారన్నది వాస్తవం.

అప్పటి నుంచి ఒక పార్టీ ఆధిపత్యం కలిగిన సమాజంగా రాష్ట్రంపై ముద్రపడింది. అలాంటి దౌర్జన్య మూకలకు రాజకీయ వ్యవస్థ అండగా ఉంటోంది. జూనియర్ డాక్టర్ హత్యాచార నిందితుడు సివిక్ పోలీసు వాలంటీర్. అతనికి ఆస్పత్రిలోకి, ఎమర్జెన్సీ వార్డు లోకి విచ్చలవిడిగా వెళ్లి రాడానికి అడ్డూఆపూ ఉండేది కాదు. ఇలాంటి సివిక్ పోలీస్ వాలంటీర్ల నియామకం కూడా లోపభూయిష్టంగా ఉంటోంది. అభ్యర్థుల అర్హత నిర్ణయించడంలో వ్యక్తిత్వ పరిశీలన గాని, కనీస జవాబుదారీతనం గాని లేకుండా చేశారు. అధికార పార్టీకి విధేయులుగా ఉంటే చాలు. తృణమూల్ కాంగ్రెస్ విధానాల ఫలితమే ఈ సివిక్ పోలీసు వాలంటీర్ వ్యవస్థకు మూలం. దీని ద్వారా కాంట్రాక్టు పద్ధతిన వాలంటీర్లను నియమించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇక ఏమాత్రం తనను తాను రక్షించుకునే విధానం పాటించడం ఎవరికీ సంతృప్తి కలిగించదు.

ఆర్‌జి కార్ సంఘటనతో ఏర్పడిన రాజకీయ గందర గోళాన్ని నివారించడానికి, తమ పాలనా యంత్రాంగంలో కొనసాగుతున్న లోపాలను పరిష్కరించే పనిని చేపట్టవలసి ఉంటుంది. ఆర్‌జి కార్ సంఘటన కన్నా ముందు రాష్ట్రంలో మహిళలపై హింసాకాండ సంఘటనలు ఎన్నో జరిగాయి. మహిళలకు రాష్ట్రం లో భద్రత లేకుండా పోయింది. 2012 లో పార్కు స్ట్రీట్‌లో కదులుతున్న వాహనంలో మహిళపై హత్యాచారం జరిగింది. 2013లో కామ్‌దునిలో కాలేజీ విద్యార్థినిపై హత్యాచారం జరిగింది. 2014 లో బీర్భూమ్ వద్ద గిరిజన మహిళపై సామూహిక మానభంగం జరిగింది. ఇటీవలనే 2022లో హంసఖలిలో అత్యాచారానికి గురైన టీనేజర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది తప్ప జవాబుదారీ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News