ప్రధాని పదవికి పోటీపై మమత వ్యాఖ్య
పణాజీ(గోవా): వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవికి పోటీలో మీరు ఉంటారా అన్న ప్రశ్నకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమాధానాన్ని దాటవేశారు. శుక్రవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆమెకు విలేకరులు ఈ ప్రశ్న వేయగా ఇప్పుడే అన్నీ చెప్పేస్తే తర్వాత చెప్పడానికి ఏముంటుందని ఆమె ఎదురు ప్రశ్నించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న అనంతరం 2024లో జరగవలసి ఉన్న సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని పదవికి పోటీ పడతారంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న గోవా అసెంబీ ఎన్నికలలో టిఎంసి పోటీ చేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో మమతా బెనర్జీ మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం గోవా చేరుకున్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే గోవాలో పోటీ చేయాలని మీ పార్టీ నిర్ణయించుకుందా అన్న ప్రశ్నకు 2024 ఎన్నికలలో తన పార్టీ పోటీ చేస్తుందని ఆమె చెప్పారు. తాము పారదర్శకంగా ఉంటామని, దాగుడుమూతలు ఆడే అలవాటు తమకు లేదని ఆమె స్పష్టం చేశారు. రానున్న అనేక దశాబ్దాల పాటు భారతీయ రాజకీయాలలో బిజెపి కేంద్ర బిందువుగా ఉంటుందని, అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీ ఎక్కడకూ పోదంటూ గోవా ఎన్నికలకు టిఎంసి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై మమతను విలేకరులు ప్రశ్నించగా ఈ ప్రశ్న తనకు వేసేకన్నా కిషోర్‌కు వస్తే బాగుంటుందని సమాధానమిచ్చారు. మేము సక్రమంగా పనిచేయకపోతే బిజెపి అక్కడే ఉంటుందన్నది ఆయన(కిషోర్) అభిప్రాయం కావచ్చని ఆమె వ్యాఖ్యానించారు.