కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీలో మహిళలపై అత్యాచారాలు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్‌ను 72 గంటల్లోగా అరెస్టు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్ మంగళవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతేగాక షాజహాన్‌ను అరెస్టు చేయలేని పక్షంలో అందుకు కారనాలను వివరిస్తూ తనకు 72 గంటల్లో లేఖ సమర్పించాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. సందేశ్‌ఖలీలో కొందరు దుండగులు ఒక చిన్నారిని విసిరి పారేసినట్లు వచ్చిన
ఆరోపణలను దర్యాప్తు చేయవలసిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. కలకత్తా హైకోర్టు తీర్పు దృష్టా సందేశ్‌ఖలిలో జరిగిన అకృత్యాల ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, అలా చేయని పక్షంలో 72 గంటల్లో తనకు కారణాలు వివరిస్తూ లేఖను సమర్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కొందరు దుండగులు ఒక చిన్నారిని విసిరినట్లు పత్రికలలో వచ్చిన వార్తలోని నిజానిజాలను నిర్ధారించాలని, ఆ ఘటన నిజమేనని తేలిన పక్షంలో నిందితులపై తక్షణమే చర్యలు తీసుకుని తనకు నివేదికను సమర్పించాలని ఆ లేఖలో గవర్నర్ పేర్కొన్నారు.