కోల్‌కతా : హింసాకాండ, పలువురు మరణంతో అట్టుడికిన పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దిశలో ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఇప్పటివరకూ ఎన్నికల సంఘం ద్వారా ప్రకటిత ఫలితాల్లో టిఎంసి తిరుగులేకుండా ఉంది. ఈ గ్రామపంచాయతీ ఎన్నికలలో టిఎంసి 34,901 స్థానాల్లో గెలుపొందింది. బిజెపికి 9719 సీట్లు వచ్చాయి.
మొత్తం 63,299 సీట్లకు ఎన్నికలు జరిగాయి. సిపిఎంకు 2938 , కాంగ్రెస్‌కు 2542 సీట్లు దక్కాయి. ఇక పంచాయతీ సమితి సీట్లలో టిఎంసికి 6430 సీట్లు వచ్చాయి. బిజెపికి 982 సీట్లు దక్కాయి. సిపిఎం 176 స్థానాలు , కాంగ్రెస్‌కు 266 సీట్లు వచ్చాయి. ఇక్కడ మొత్తం 9728 పంచాయితీ సమితి సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇక టిఎంసి ఏకంగా 674 జిల్లా పరిషత్ సీట్లను దక్కించుకుని, 150 సీట్లలో ఆధిక్యతలో ఉంది. దీనితో రాష్ట్రంలో మొత్తం మీద అన్ని జడ్‌పి ఛైర్మన్ పదవులను టిఎంసినే దక్కించుకుని, మునుపటి రికార్డును స్థాపించనుంది.
బిజెపి, సిపిఎం, కాంగ్రెస్‌లు కొన్ని జిల్లాల్లో తమ ప్రాబల్యం పెంచుకున్నా జడ్‌పి స్థానాలు టిఎంసి కైవసం అయినట్లే. ఇప్పటి ఎన్నికల్లో విజయం స్థానికంగా ప్రజలకు తమ పార్టీ పట్ల ఉన్న ఆదరణకు సంకేతం అని టిఎంసి ప్రకటించింది. హింసాకాండలో తమ పార్టీకి చెందిన 11 మంది చనిపోయినట్లు, ప్రతిపక్ష పార్టీలు ఓటమి భయంతో పాల్పడిన అరాచక చర్యల ఫలితం ఇది అని పార్టీ తెలిపింది. బిజెపి గూండాలు, కాంగ్రెస్, సిపిఎంలకు చెందిన కలిసికట్టు కిరాయి మూకలు ఈ దారుణాలకు బాధ్యులని విమర్శించింది.
తుది తీర్పు తరువాతనే ఫలితాలు: బెంగాల్ హైకోర్టు కీలక రూలింగ్
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కలకత్తా హైకోర్టు బుధవారం కీలక రూలింగ్ వెలువరించింది. హింసాకాండ , విధ్వంసం పరిస్థితుల నడుమ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల వెల్లడి, ఎన్నికల విషయంపై తమ తుదితీర్పు ఫైనల్ అవుతుందని తెలిపింది. అన్ని అంశాలను విచారించిన తరువాత వెలువడే తుది తీర్పు తరువాతనే ఎన్నికల ఫలితాల విషయం స్పష్టం అవుతుందని స్పష్టం చేశారు. సంబంధిత అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే విజేతలుగా ప్రకటితులైన అభ్యర్థులందరికి హైకోర్టు రూలింగ్ వివరాలు తెలియచేయాలని కోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.