Wednesday, April 16, 2025

అల్లర్లకు చిరునామా బెంగాల్

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో ఒకదాని వెంట ఒకటిగా చోటుచేసుకుంటున్న వివాదాలు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సవాలుగా పరిణమిస్తున్నాయి. నిరుడు పార్ల మెంటు ఎన్నికలకు ముందు జరిగిన సందేశ్ ఖలీ మానభంగాల కేసు, గత ఏడాది చివర్లో కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు ఎంతటి పెను వివాదాలకు కారణమయ్యాయో తెలిసిందే. ఈ మధ్య 26 వేల మంది స్కూలు టీచర్ల నియామకాలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టడంతో మరో వివాదం దీదీ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తుండగా, గోరుచుట్టుపై రోకటిపోటులా తాజాగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి.

వారం రోజుల క్రితం వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి రాగా, దేశంలో ఎక్కడా లేనంత తీవ్ర స్థాయిలో బెంగాల్‌లో అల్లర్లు మొదలయ్యాయి. ముస్లిం జనాభా ఎక్కువగా గల ముర్షీదాబాద్, మాల్డా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. ఈ అల్లర్లకు ఇప్పటికే ముగ్గురు బలికాగా, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు భారీస్థాయిలో ధ్వంసమయ్యాయి. నిరసనకారులు ప్రధాన రహదారుల్ని, రైల్వే ట్రాకుల్నీ దిగ్బంధం చేస్తూ ప్రజా జీవనానికి విఘాతం కలిగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అల్లర్లు తగ్గుముఖం పట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అల్లర్ల మాట అలా ఉంచితే, రాష్ట్రంలో విపక్ష భారతీయ జనతాపార్టీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ స్వప్రయోజనాలకోసం పాకులాడుతూ, జరిగిన సంఘటనకు బాధ్యత మీదంటే మీదేనంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.

బెంగాల్‌లో ఎప్పుడు అల్లర్లు చెలరేగినా దాన్ని ప్రభుత్వ తప్పిదంగా అభివర్ణించే బిజెపి ఈసారి కూడా అదే పాట పాడింది. ఇటీవల 26 వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ ప్రతిష్ఠ మంటగలవడంతో దానినుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు వేసిన ఎత్తుగడ ఇదని కమలనాథులు ఆరోపిస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి.. వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిన కేంద్రమే అల్లర్లకు బాధ్యత వహించాలనే రీతిలో మాట్లాడుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టం గురించి కేంద్రాన్నే అడగాలని, రాజకీయాలకోసం అల్లర్లకు దిగవద్దని ఆమె ఇచ్చిన పిలుపునకు నిరసనకారులు ఏమాత్రం స్పందించడంలేదు సరికదా మరింత పేట్రేగిపోతున్నారు. అల్లర్లకు కేంద్ర బిందువైన ముర్షీదాబాద్ జిల్లాలో ముస్లిం జనాభాదే ఆధిపత్యం.

ఈ జిల్లాలోని మూడు పార్లమెంటు సీట్లనూ తృణమూల్ గెలుచుకుంది. 22 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లకు తృణమూల్ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీదే పైచేయి. అలాంటప్పుడు, అల్లర్లు ఎలా చెలరేగాయన్న ప్రశ్నకు అధికార పార్టీనుంచి జవాబు లేకపోవడం గమనార్హం. గతంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడూ ముర్షీదాబాద్ భగ్గుమంది.

ఇంతటి సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతంలో ముందుజాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదో ప్రభుత్వమే జవాబు చెప్పాలి. అటు ప్రభుత్వం, ఇటు విపక్షం అల్లర్ల విషయంలో బాధ్యత విస్మరించి స్వప్రయోజనాలకోసం పాకులాడుతూండటంతో పౌరులే ముందుకొచ్చి బెంగాల్ పరిస్థితిపై జోక్యం చేసుకోవలసిందిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు జోక్యం చేసుకుని, తక్షణం రాష్ట్రానికి కేంద్ర భద్రతా బలగాలను పంపించాలంటూ ఆదేశించడం గమనార్హం. వక్ఫ్ చట్టంలో లొసుగులున్నాయని ఎవరైనా భావిస్తే, వాటిని న్యాయస్థానాలలో సవాల్ చేసే హక్కు ఉంది. అంతే తప్ప, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అల్లర్లకు దిగడం సమంజసం కాదు.

అలాగే, సమాజంలో ఒక వర్గాన్ని బుజ్జగించేందుకుగాను వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి చెప్పడం ప్రజాస్వామిక వ్యవస్థనే పరిహాసం చేసే విధంగా ఉంది. పార్లమెంటు చేసిన చట్టాలను మరో మాట లేకుండా అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలదే. ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. అలాంటప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న దీదీ పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేయబోమని ఎలా చెబుతారు? ప్రతిపక్షాల ఆరోపణలను వమ్ము చేసేందుకు దీదీ ప్రభుత్వం అల్లర్లను నిర్దాక్షిణ్యంగా అణచివేసి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవలసిన అవసరం ఉంది. మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వాంఛనీయం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News