Monday, December 23, 2024

బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన!

- Advertisement -
- Advertisement -

ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి తీవ్రంగా కొట్టిన వీడియో వైరల్
మమత సర్కార్‌పై బిజెపి తీవ్ర ఆరోపణలు
కొట్టిపారేసిన తృణమూల్ కాంగ్రెస్

కోల్‌కతా: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మరువకముందే పశ్చిమ బెంగాల్‌లోనూ అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి పాల్పడ్డారనే నెపంతో ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి కొందరు మహిళలు తీవ్రంగా కొట్టినట్లుగా ఉన్న సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బిజెపి, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య మాటలయుద్ధం మరింత ముదిరింది.పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో మూడు, నాలుగు రోజుల క్రితం కొంతమంది మహిళా వ్యాపారులు ఇద్దరు మహిళలను పట్టుకున్నారు.

Also Read: మృత్యుంజయుడు ఆ జెసిబి డ్రైవర్(వైరల్ వీడియో)

వీరిద్దరూ దొంగతనం చేస్తున్నారని ఆరోపిస్తూ వారి శరీరం పైభాగంలో ఉన్న దుస్తులను తొలగించి కొట్టారు. అయితే వ్యాపారులు కానీ, బాధిత మహిళలు కానీ పోలీసులకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కాగా ఈ వీడియో తమ దృష్టిలోకి పడిన తర్వాత మాత్రమే ఈ సంఘటన గురించి తమకు తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. బాధితులు పారిపోగా వారిని పట్టుకున్న వారు కూడా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడడం లేదని తెలిపారు. ఈ ఘటన ఇటీవలే పకుహట్ ప్రాంతంలో జరిగినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, తగిన చర్య తీసుకుంటామని తెలిపారు.

కాగా శనివారం మీడియా సమావేశంలో ఈ వీడియోను చూపించిన బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ రాష్ట్రంలో భయోత్పాతం కొనసాగ్తుందని ఆరోపించారు. మాల్డాలోని బమన్గోలా పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్ర్తలను చేసి నిర్దయగా హింసించి, కొట్టారని ఆరోపించారు. పకుహట్ ఏరియాలో ఈ నెల 19న ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు. బాధిత మహిళలు సాంఘికంగా అణగారిన వర్గానికి చెందిన వారని,పిచ్చిపట్టిన మూక ఆ మహిళల రక్తం తాగడానికి తహతహలాడిందని మండిపడ్డారు.

ఈ విషాదకర ఘటన ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హృదయాన్ని పగులగొట్టి ఉంటుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆమె రాష్ట్రానికి హోంమంత్రి కూడా కాబట్టి కేవలం ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా చర్య తీసుకుని ఉండాలన్నారు. అయితే ఏమీ చేయకూడదని ఆమె నిర్ణయించుకున్నారని దుయ్యబట్టారు. అయితే బిజెపి ఆరోపణలను రాష్ట మహిళా, శిశు సంక్షేమ వాఖ మంత్రి శశిపంజా తోసిపుచ్చారు.ఆ ఇద్దరు మహిళలు దొంగతనం చేసినట్లు ఆరోపించిన ఇతర మహిళలతో గొడవకు దిగారని, అక్కడే ఉన్న మహిళా సివిల్ పోలీసు వలంటీర్లు గొడవ ఆపడానికి ప్రయత్నించారని శనివారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆ తర్వాత మహిళలు తమకు తామే అక్కడినుంచి వెళ్లిపోయారని చెప్పారు. కూరగాయల వ్యాపారుల మధ్య జరిగిన గొడవనుపెద్దదిగా చేసి చూపించడం ద్వారా బిజెపి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తోందని ఆమె దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News